రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ‘నో వర్క్-నో పే’ అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల చేపట్టిన సకల జనుల సమ్మెపై 2011లో ప్రయోగించిన జీవో-177ను ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం ప్రయోగించింది. జీవో-177ను తూచా తప్పకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ప్రత్యేకంగా ఈ నెల 8వ తేదీనే ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నెల నాలుగో తేదీన అత్యవసరంగా విజయవాడలో సమావేశమై రాష్ట్ర విభజన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసు ఇచ్చారని ఆదేశాల్లో సీఎస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై 2011 ఏప్రిల్ నాలుగో తేదీన జారీ చేసిన జీవో-177 ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని, తదుపరి ఆదేశాల కోసం వేచి చూడవద్దని స్పష్టం చేశారు. సచివాలయంలోని అన్ని శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు సమ్మె కాలంలో సాధారణ పరిపాలన వ్యవహారాలకు, అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల హాజరు నివేదికను ప్రతిరోజూ సచివాలయానికి పంపించడంతో పాటు సమ్మె చేస్తున్న ఉద్యోగులపై జీవో-177 ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, రాష్ట్ర వర్క్స్ ప్రాజెక్ట్స్ అండ్ అకౌంట్స్, ట్రెజరీ విభాగాల సబార్డినేట్ సర్వీసెస్‌లలో సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సేవలను అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని, ఆరు నెలల పాటు సమ్మె నిషేధం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాంతియుతంగా సమ్మెచేస్తే ఎలాంటి చర్యలు చేపట్టబోమని ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన హామీకి విరుద్ధంగా ట్రెజరీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ఎస్మాలన్నీ సమైక్య సమ్మె ముందు భస్మమవుతాయని, తుదివరకు ఏపీఎన్జీవోలతోపాటే నడుస్తామని తెలిపారు.
జీవో-177లోని అంశాలు...
ఉద్యోగుల ఆందోళన మీద రోజువారీ నివేదికలను జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్)కి పంపించాలి.
ఆందోళన చేస్తున్నప్పుడు హాజరు రిజిస్టర్లలో సంతకాలు చేసి సాధారణ విధులకు హాజరుకాని ఉద్యోగుల వివరాలు సేకరించి ప్రత్యేక రికార్డుల్లో నమోదు చేయాలి.
ఆందోళనలో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
ఆందోళన జరిగే సమయంలో... విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఇబ్బంది(డిస్టబెన్స్) కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులు, బృందాలు, సంఘాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలి.
ఆందోళనలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటలాడటం, డ్రమ్ములు వాయించడం, విధి నిర్వహణకు వీలుకాని విధంగా ఇబ్బంది కలిగించే ఉద్యోగుల మీద తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి అధికారవర్గాలు ఉపక్రమించాలి.
ఆందోళన కొనసాగించినంతకాలం... అందులో పాల్గొన్న ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జీతభత్యాలు చెల్లించకూడదు. ‘నో వర్క్ -నో పే’ విధానాన్ని కచ్ఛితంగా అమలు చేయాలి.
ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు అతిక్రమించే ఉద్యోగుల మీద చట్టప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
పని చేయకపోతే వేతనం లేదు...
Published Sun, Aug 18 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement