75 రోజులుగా సడలని సమైక్య ఉద్యమ స్ఫూర్తి
ఊరూ వాడా కదిలాయి.. ఒక్కటై నిలిచాయి.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఉద్యమించాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 75 రోజులుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ అధిష్ఠానం గాంధారీ అంధత్వాన్ని నటిస్తున్నా వాళ్లు మాత్రం ఉద్యమ దీక్షను ఏమాత్రం సడలనివ్వలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సమైక్య ఉద్యమానికి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
అదే సమయంలో వారు మానవత్వాన్నీ మరువలేదు. పై-లీన్ తుఫాను విరుచుకుపడుతోందన్న సమాచారం అందగానే, సమ్మెలో ఉన్నామన్న విషయాన్ని పక్కన పెట్టి వెంటనే రంగంలోకి దిగారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారి బాగోగులను స్వయంగా చూసుకోవడం, కేంద్ర భద్రతా దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకోవడం లాంటి పనులన్నీ దగ్గరుండి చేశారు. తమలోని మానవత్వాన్ని నిరూపించుకున్నారు. ఈనెల 8వ తేదీన తుఫాను రానుందన్న సమాచారం రాగా.. 9వ తేదీనే సీమాంధ్ర ప్రాంతానికి ఉద్యోగులంతా విధులకు హాజరయ్యారు. తుఫాను తీరం దాటి, ఇక తమ అవసరం అంతగా లేదని తెలియగానే.. మళ్లీ దీక్షాధారులై ఉద్యమంలోకి దూకారు.
విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ఉపాధ్యాయులు, అత్యవసర సర్వీసు అయినందున విద్యుత్ ఉద్యోగులు, పండుగలు సమీపించి.. ప్రజలకు ప్రైవేటు బస్సు చార్జీలు భారం కాకూడదన్న సదుద్దేశంతో ఆర్టీసీ కార్మికుల వరకు సమ్మెను విరమించినా, మిగిలిన ఉద్యోగులు, పార్టీలకు అతీతంగా ప్రజలు మాత్రం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో సీమాంధ్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూనే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పలు ప్రజాస్వామ్య ఉద్యమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈజిప్టులో గానీ, ఇతర మధ్యప్రాచ్య దేశాల్లో గానీ ఈ తరహా స్ఫూర్తి మనకు బాగా కనిపిస్తుంటుంది. సమైక్య ఉద్యమంలోనూ ఇదే తరహా స్ఫూర్తి కనిపిస్తోంది. రాజకీయ నాయకులెవరూ పిలుపునివ్వకుండానే.. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. జేఏసీలు ఏవీ లేనప్పుడు కూడా ఒకరోజు మూడు నాలుగు జిల్లాల్లోను, మరో రోజు అక్కడ కాక మరో నాలుగు జిల్లాల్లోను లక్ష గళ ఘోష లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడికక్కడే మర్నాటి ఉద్యమానికి కావల్సిన ఏర్పాట్ల కోసం పలువురు ముందుకొచ్చారు. ఇలా ప్రతి హృదయంలోనూ రగిలిన స్ఫూర్తి వల్లే నిరాటంకంగా 75 రోజులుగా సమైక్య ఉద్యమం కొనసాగుతూనే ఉంది.