సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా రెండున్నర నెలలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న సీమాంధ్ర ప్రజ దసరాపర్వదినం నాడు నిరాహారదీక్షలతో ఉద్యమాన్ని కొనసాగించింది. కృష్ణాజిల్లావ్యాప్తంగా మహిళలు పెద్దసంఖ్యలో నిరశన దీక్షలు చేపట్టారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలో రైతులు మానవహారంగా ఏర్పడ్డారు. ప్రకాశం జిల్లా పర్చూరులో న్యాయవాదులు 70వ రోజు దీక్షను కొనసాగించగా, ఉద్యోగ జేఏసీ 25వ రోజు దీక్ష నిర్వహించింది.
నెల్లూరులోని ఎన్‌జీఓభవన్‌లో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలకు గుమ్మడి కాయలను తగిలించి గూడురులో ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మహిళా పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సద్భావన సర్కిల్‌లో టీనోట్‌ను వ్యతిరేకిస్తూ.. నకలు ప్రతులను దహనం చేశారు. సోనియాగాంధీకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఉరవకొండలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి.. భజనలు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఉద్యమకారులు 75 సంఖ్య ఆకారం లో జాతీయ రహదారిపై బైఠారుుంచారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉద్యోగులు సమైక్యవాణి వినిపించారు. శ్రీకాళహస్తిలో కల్యాణ మండపం వద్ద రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. చిత్తూరులో జేఏసీ నాయకులు గాంధీ బొమ్మవద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వైఎస్‌ఆర్ జిల్లా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పోరుమామిళ్ల, మైదుకూరుల్లో ఎన్జీవో, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో నిరసనలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
కర్నూలులో ఉపవాసదీక్షలు
కర్నూలు జిల్లా ఆదోనిలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో నవజ్యోతి పాఠశాల విద్యార్థులు పాతబస్టాండ్ కూడలిలో ఉపవాసదీక్ష చేశారు. ఆళ్లగడ్డలో సమైక్యాం ధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ నాయకులు పండగ పక్కన పెట్టి కుటుంబ సమేతంగా రిలే నిరాహర దీక్షలో కూర్చొన్నారు. కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌లో న్యాయవాదుల దీక్షలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి.
వ్యతిరేకంగా ఓటేస్తాం
ఎన్జీవోలకు ప్రజాప్రతినిధుల హామీ
రాష్ర్ట శాసనసభలో అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆదివారం ఎన్జీవోలకు ప్రమాణం చేసి హామీపత్రాలను సమర్పించారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలోఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడపలో మంత్రి అహ్మదుల్లా ఈ మేరకు ఎన్జీవోనేతలకు రాతపూర్వక పత్రాలు సమర్పించారు.