► గాడిదపాల విక్రయంతో జీవనోపాధి
► మంచిర్యాలవాసుల వలస జీవితాలు
సాక్షి, భీమవరం: గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. ఖరముపాలు కడివిడైనా నేమి అన్న సూక్తి ఆ కుటుంబాలకు వర్తించదు. ఖరము పాలు ఆ కుటుంబాలకు జీవనాధారం. తెలంగాణ, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొన్ని పేద కుటుంబాలు ఏటా ఆంధ్రాకు వలసవచ్చి 8 నెలల పాటు ఇక్కడే ఉంటారు. తమతోపాటు గాడిదలను తీసుకువస్తారు. జిల్లాలవారీగా పట్టణాలను ఎంపిక చేసుకుని ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుంటారు. అక్కడి నుంచి వాహనాల్లో గాడిదలను సమీప గ్రామాలకు ఉదయమే తీసుకువెళతారు. ఒకచోట వాహనాలను ఆపి ఆ గాడిదలను వీధుల్లో తిప్పుతూ వాటిపాలను విక్రయిస్తున్నారు.
50 గ్రాములు.. రూ.100
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో కూడా గాడిద పాలు ఇష్టంగా తాగుతున్నారట. చిన్నటి గ్లాసు (50 గ్రాములు) గాడిద పాల ధర రూ.100. గాడిదలను రోడ్లపై తోలుకువచ్చి అప్పటికప్పుడు పాలు పితికి విక్రయిస్తున్నారు. గాడిదపాలు సర్వరోగ నివారిణి అని వీరు చెబుతుండటంతో నమ్మకం ఉన్నవారు కొనుగోలు చేస్తున్నారు. నమ్మనివారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఈ సంచార వాసులు భీమవరం–తాడేపల్లిగూడెం రోడ్డులోని బైపాస్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. గాడిదలను ఆటోల్లో పట్టణాలకు, గ్రామాలకు తీసుకువెళ్లి ఇంటింటికి తిప్పుతూ పాలు విక్రయిస్తున్నారు. ఏడాదిలో 8 నెలలపాటు గాడిద పాలను విక్రయిస్తూ సంచార జీవనం సాగిస్తున్నాయి ఈ కుటుంబాలు. తరువాత తమ సొంత ప్రాంతమైన మంచిర్యాలకు వెళ్లిపోతారు. అక్కడ రోళ్లు తయారు చేసి నాలుగు నెలల పాటు ఉంటారు. తరువాత మళ్లీ సంచార జీవితమే.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో..
గాడిదపాలు సర్వరోగ నివారణి గ్యాస్, బీపీ, షుగర్ వ్యాధులు నడుం, కీళ్ల నొప్పులు, ఆయాసం తగ్గుతుంది. పచ్చిపాలు తాగాలి. మా పెద్దలు చెప్పారు. మేం నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం. మేం కూడా ఇవే తాగుతున్నాం. నమ్మిన వాళ్లు కొంటారు. కొందరు నవ్వుతూ చూస్తారు. ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పాలు విక్రయిస్తాం. -లాలూ, మంచిర్యాల వాసి
గాడిదలే గంగిగోవులు
Published Mon, Sep 11 2017 10:39 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
Advertisement
Advertisement