సాక్షి ప్రతినిధి, గుంటూరు: నామినేటెడ్ పోస్టుల భర్తీ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలకు తలనొప్పిగా పరిణమించింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలను తీసు కోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు సూచించారు. దీనిపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ కూడా చేయడంతో నియోజకవర్గాల్లో ఆశావహుల హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడప్పుడూ మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీని కలుస్తున్నారు. మంత్రుల కంటే కోడెల, జీవీలను కలిసే ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన నేతల్లో ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కోరుతున్నారు. ఆయా కార్పొరేషన్ పదవుల పరిధి, ప్రాధాన్యత, ఆదాయ వ్యయాల వివరాలను సేకరిస్తున్నారు. మరి కొందరు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవసరమైన ఖర్చు పెట్టుకోగలమని చెబుతూ ఎమ్మెల్యేలు, ఇతర నేతల మద్దతు కోరుతున్నారు.
ద్వితీయశ్రేణి నాయకులు మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీ చైర్మన్ పదవులను కోరుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందిన గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం పార్టీలోని పలువురు సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కంచేటి శివప్రసాద్, మన్నవ సుబ్బారావు, మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాస యాదవ్ తదితరులు ఆశిస్తున్నారు. వీరంతా చిరకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు.
జిల్లాలోని మిగిలిన నామినేటెడ్ పోస్టుల కంటే మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి అత్యధిక ప్రాధాన్యం ఉండటంతో తమ వర్గానికి ఈ పదవి దక్కాలనే ఉద్దేశంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు.
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరి కొందరు ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజా మాస్టారు, చందు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ ఈ పదవి కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా వీలైతే కార్పొరేషన్ లేకుంటే ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. జిల్లా మంత్రులు, శాసన సభ్యుల సహకారం కోరుతూ టచ్‌లో ఉంటున్నారు.
మరి కొందరు రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న ‘క్రీడా’ (సీఆర్‌డీఏ)లో సభ్యునిగా నామినేట్ అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్న వాతావరణం పార్టీలో కనపడుతోంది.
జిల్లాలోని మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ పదవులు, దేవాలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ పదవులను నియోజకవర్గ స్థాయి నాయకులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వీరంతా ముఖ్య భూమిక వహిస్తున్నారు. శాసన సభ్యుల సిఫారసులతోపాటు పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో ప్రస్తుత సభ్యత్వ నమోదులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జిల్లా అధ్యక్షుడి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో ఈ కమిటీ పదవులను ఆశిస్తున్న నేతలంతా సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొంటున్నారు.ఇప్పటి వరకు జిల్లాలో ఆరు లక్షల వరకు సాధారణ సభ్యత్వ నమోదు జరగడానికి కూడా నామినేటెడ్ పదవుల భర్తీ కూడా ఒక కారణమనే అభిప్రాయం పార్టీలో వినపడుతోంది.
నామినేటెడ్ శిరోభారం
Published Sat, Dec 20 2014 1:57 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement