బి.కొత్తకోట, న్యూస్‌లైన్: రాయలసీమ కరవు రైతు కలల ప్రాజెక్టు హంద్రీ-నీవా సుజల స్రవంతి. ఈ ప్రాజెక్టును 1989లో టీడీపీ ప్రభుత్వం 1989లో చేపట్టింది.1994లో తిరిగి అధికారంలోకి వచ్చిన అదే టీడీపీ ప్రాజెక్టును అటకెక్కి స్తే, 2004లో ముఖ్యమంత్రి అయిన మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టుకు జీవంపోశారు. రెండు దశలో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. తొలిదశలో రూ.2,774 కోట్లతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.96 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల ఎకరాలకు మంచినీరు అందించడం, రెండో దశలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రూ.4,076 కోట్లతో 4.70 లక్షల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల జనాభాకు తాగునీరు అందించడం లక్ష్యం.
ప్రాజెక్టుకోసం వైఎస్ అవసరమైన మేరకు నిధులను కేటాయించారు. 2007-08లో రూ.925కోట్లు, 2008-09 లో రూ.1,165కోట్లు, 2009-10లో రూ.1,000 కోట్ల నిధులిచ్చి 2012నాటికే పనులు పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మధ్యకాలం లో పనులు శరవేగంగా జరిగాయి. ఇప్పుడు పూర్తయిన కాలువ పనులన్నీ వైఎస్ హయాం లో జరిగినవే. భూసేకరణ చర్యలు వేగవంతంగా సాగాయి. నిధుల వినియోగం సత్వరమే జరిగింది. కేటాయింపులకు తగ్గట్టుగా పనులు చేపట్టారు.
ఆయన అనంతరం పరిస్థితుల్లో మార్పువచ్చింది. ప్రాజెక్టుకు అరకొర నిధుల కేటాయింపు, పూర్తిచేయాల్సిన పనుల గడువు పెంచడంలాంటి అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి. రెండు దశలకు సంబంధించి ప్రాజెక్టుకు 2010-11లో రూ.640కోట్లు కేటాయించగా, 2011-12లో రూ.695 కోట్లు కేటాయించారు. 2012-13లో రూ.698కోట్లు ఇచ్చారు. ఇందులో సగం నిధులైనా వినియోగించుకోలేని దుస్థితి. 2013-14కు బడ్జెట్‌లో రూ.1,251కోట్లు అడిగితే ప్రభుత్వం రూ.416కోట్ల చాలాంటూ ఎంగిలి మెతుకులు విదిల్చింది. పాజెక్టుకు ప్రాణంపోసిన వైఎస్ హయాంలో నిధులు భారీగా ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వాలు దీనిపై నిర్లక్ష్యం చేశాయి.
పనులింకా పెండింగ్‌లోనే...
ఈ ఏడాది డి సెంబర్ నాటికి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోసాగే రెండోదశ ఏవీఆర్ హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తిచేయాలి. అయితే గడువు మేరకు పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. నిధుల కొరత, పనుల్లో జాప్యంవల్ల చోటుచేసుకుంటోంది. డిస్ట్రీబ్యూటరీ పనులు ఇంకా మొదలుకాలేదు. భూసేకరణ, పెండింగ్‌లోని కాలువల తవ్వకం, రైల్వేక్రాసింగ్ పనులు చేయాల్సివుంది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కోసం విద్యుత్‌సబ్‌స్టేషన్ల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఎత్తిపోతల పథకాల నిర్మాణ పరిస్థితీ ఇలాగేవుంది.