అచ్చంపేట/రూరల్, న్యూస్‌లైన్: భారీవర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని మంత్రి డీకే అరుణ భరోసాఇచ్చారు. శనివారం సాయంత్రం ఆమె అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు. అచ్చంపేట మండలం రంగాపూర్ చంద్రవాగు, చంద్రసాగర్, బొమ్మనపల్లి-సిద్ధాపూర్ రహదారిలోని మనుగుబ్బలవాగు కల్వర్టు పరిశీలించి ఉప్పునుంతల మండలం పిర్వాట్‌వానిపల్లి రైతులతో మాట్లాడారు.
జిల్లాలో దెబ్బతిన్నరోడ్లను పునరుద్ధరించి తెగిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల మరమ్మతులు చేపడతామన్నారు. ఇప్పటివరకు రూ.40కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, మరోసారి పూర్తి స్థాయి అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో కొట్టుకపోయిన మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను పునరుద్ధరించేందుకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని మంత్రి డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. పంటనష్ట అంచనాలు ఆదర్శరైతులకు కాకుండా వీఆర్వోలకు ఇవ్వాలని, వారు తయారుచేసిన జాబితానే జిల్లా అధికారులకు అందించాలని సూచించారు. మంత్రి వెంట అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మార్కెట్ చైర్మన్ శ్రీపతిరావు తదితరులు ఉన్నారు.
బాధిత రైతులను ఆదుకుంటాం: మంత్రి
Published Sun, Oct 27 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement