నలుగురు కాదు వంద | Not four hundred | Sakshi
Sakshi News home page

నలుగురు కాదు వంద

Published Tue, Apr 22 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

నలుగురు కాదు వంద

నలుగురు కాదు వంద

  • రాష్ట్రంలోని  కిడ్నీ ఏజెంట్ల సంఖ్య ఇది
  •  దేశవ్యాప్తంగా వెయ్యికిపైగానే
  •  ప్రధాన సూత్రధారి ప్రశాంత్‌సేఠ్, ఆలం కోసం వేట
  •  సాక్షి, హైదరాబాద్ : దినేష్ మృతితో కిడ్నీ రాకెట్ గుట్టు విప్పిన సీసీఎస్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న విజయవాడ, పశ్చిమగోదావరి, నల్లగొండ, హైదరాబాద్‌కు చెందిన కిడ్నీ ఏజెంట్లు శ్రీనివాస్, కిరణ్, వెంకటేశ్వర్లు, సురేష్‌లను విచారించగా పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు వెలుగు చూశాయి.

    మన రాష్ట్రంలోనే వందకుపైగా కిడ్నీ క్రయవిక్రయాలు జరిపే ఏజెంట్లు ఉన్నారని వెంకటేశ్వర్లు వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో తేలింది. వీరంతా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి కిడ్నీ ఇచ్చి వచ్చిన వారే కావడం గమనార్హం. మరింత ఆదాయం గడించేందుకు ఏజెంట్లుగా మారిన వీరు తెలిసిన వారికి గాలం వేసి ప్రధాన సూత్రధారి ద్వారా శ్రీలంకకు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కలిపితే వెయ్యికిపైగా ఏజెంట్లు ఉంటారని తెలిసింది. ప్రధాన సూత్రధారులు మాత్రం ఒడిశా, చెన్నైకి చెందినవారని పోలీసుల విచారణలో తేలింది. దినేష్ మృతిపై విచారణ కోసం తమ దేశం వస్తే పూర్తి సహకారం అందిస్తామని సీసీఎస్ పోలీసులకు శ్రీలంక పోలీసులు తెలిపారు.
     
    కిడ్నీ అమ్మేవారిని బ్రోకర్లు వారి పాస్‌పోర్టుపై విజిటింగ్ వీసా కింద స్టాంపింగ్ వేయించి శ్రీలంక తీసుకెళ్తున్నారు. విజిటింగ్ వీసాపై వెళ్లిన వ్యక్తి అనారోగ్యానికి గురైతే అక్కడి డాక్టర్లు ఆకస్మిక వైద్యం అందించవచ్చు. అంతేగాని ఆరోగ్యంగా ఉన్న అతని నుంచి కిడ్నీ తీయడం నేరం. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఇలా వెళ్లి కిడ్నీ అమ్ముకున్న వారందరి పాస్‌పోర్టులపై విజిటింగ్ వీసా అని స్టాంపింగ్ వేసి ఉంది.
     
    ప్రశాంత్‌సేఠ్ ఆఫర్ లెటర్....
     
    ‘హలో.. నేను ప్రశాంత్ సేఠ్‌ని.. కిడ్నీ అమ్మాలనుకున్నారా.. నేను అన్ని విధాల సహాయపడతా. ఆపరేషన్ మాత్రం ఇరాన్, సింగపూర్, శ్రీలంక దేశాలలో మాత్రమే చేయిస్తా. పాస్‌పోర్టు, ట్రావెల్స్ ఖర్చులు, భోజనం, వసతితో పాటు సకల సౌకర్యాలు నేనే కల్పిస్తా. అడిగినంత డబ్బు కూడా ఇస్తా. నా గురించి నచ్చిన వారు నా మెయిల్ లేదా సెల్ నంబర్‌ను సంప్రదించండి’ అని దినేష్ మెయిల్‌కు ప్రశాంత్‌సేఠ్ మార్చి 9న ఆఫర్ లెటర్ పంపాడు.
     
    ప్రశాంత్ కోసం వేట...
     
    రాష్ట్రంలో ఉన్న కిడ్నీ ఏజెంట్లకు ప్రశాంత్‌సేఠ్‌తో పాటు చెన్నైకి చెందిన ఆలం ప్రధాన సూత్రధారులని తేలింది. దీంతో వారి కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆలం కాశ్మీర్‌కు పారిపోయాడని నిర్ధారించుకున్న పోలీసులు ప్రశాంత్‌సేఠ్ కోసం ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement