
పత్తిపాటి పుల్లారావు
ఢిల్లీ: రైతురుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పలేదని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామన్నామంతే అన్నారు. ఆర్బిఐ నుంచి రీషెడ్యూల్ లేఖ రాగానే కోటయ్య కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. కోటయ్య కమిటీ నియమనిబంధనల మేరకు రుణమాఫీ చేస్తామన్నారు.
తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉన్నందునే రుణమాఫీ అంటున్నారని చెప్పారు. ఏపీకి లోటు బడ్జెట్ ఉందని, ఒక సంవత్సరం మారటోరియం, రెండు సంవత్సరాలు రీషెడ్యూల్ చేస్తారన్నారు. గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు 500 ఎకరాల స్థలం సిద్ధం చేసినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రంని నిధులు అడిగినట్లు చెప్పారు. ఏపీని ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.