ఆ రాయితీల మాటేమిటి? | Notification for loans | Sakshi
Sakshi News home page

ఆ రాయితీల మాటేమిటి?

Jul 19 2015 12:13 AM | Updated on Sep 2 2018 4:48 PM

జిల్లాలో బీసీ, ఎస్సీలకు ప్రభుత్వం నిర్దేశించిన రుణలక్ష్యాలు పూర్తవుతున్నా మంజూరు చేస్తున్న సబ్సిడీలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా జమకావడంలేదు.

గత రెండేళ్లుగా జమకాని సబ్సిడీలు
 కొత్తగా రుణాలకోసం నోటిఫికేషన్ జారీ
 యూనిట్లు నెలకొల్పిన లబ్ధిదారుల్లో ఆందోళన
 పట్టించుకోని అధికార యంత్రాంగం
 
 శ్రీకాకుళం పాతబస్టాండ్ :జిల్లాలో బీసీ, ఎస్సీలకు ప్రభుత్వం నిర్దేశించిన రుణలక్ష్యాలు పూర్తవుతున్నా మంజూరు చేస్తున్న సబ్సిడీలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా జమకావడంలేదు. దీనికి గత రెండేళ్ల గణాంకాలే నిదర్శనం. తాజాగా రుణాలకోసం వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకోమని నోటిఫికేషన్ జారీ చేయడంతో దాని ప్రభావం ఈ లక్ష్యాలపై పడవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా ఏర్పాటు చేసుకున్న యూనిట్లకు సంబంధించి సబ్సిడీలు జమచేయనపుడు ఈ సారి కొత్తగా రుణాలకోసం నోటఫికేషన్ విడుదల చేయడం ఎందుకని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
 
 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వెనుకబడిన తరగతులవారికి 875 యూనిట్లు కేటాయించగా అన్నింటినీ గ్రౌండ్ చేశారు. వీటికి సబ్సిడీగా రూ. 2.68 కోట్లు కేటాయించగా ఇంకా అందులో చాలా యూనిట్లకు నిధులు జమకాలేదు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో కూడా 746 యూనిట్లకు సబ్సిడీ రూ. 1.5 కోట్లు కేటాయించగా ఇందులో చాలావరకూ జమకాలేదు. ముఖ్యంగా ఏపీ వికాస్ బ్యాంకులో రుణాలు తీసుకున్నవారికి మాత్రమే సబ్సిడీలు జమకావట్లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.
 
 2014-15 ఆర్థిక సంవత్సరంలో
  వెనుకబడిన తరగతులవారి కోసం 3138 యూనిట్లు మంజూరుకాగా అన్నింటినీ ఏర్పాటు చేశారు. వీరికి రూ. 20.9 కోట్లు రాయితీ మొత్తాలు మంజూరయ్యాయి. షెడ్యూలు కులాలవారికి 1158 యూనిట్లకు రూ. 16.41కోట్లు సబ్సిడీ విడుదలైంది. అయిదు నెలలు గడుస్తున్నా ఆ మొత్తాలు జమకాలేదు.  2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాల కోసం నోటిఫికేషన్ తాజాగా విడుదల చేశారు. బీసీలు 5970 యూనిట్ల ఏర్పాటుకు రూ. 16.33 కోట్లు, ఎస్సీలు 2292 యూనిట్ల ఏర్పాటుకు రూ. 30.36 సబ్సిడీ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. పాతవాటికే సబ్సిడీలు జమకానపుడు కొత్తవారికెలా జమవుతాయని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇక్కడా జన్మభూమి కమిటీలకే పెద్దరికం
 ఈ ఏడాది లక్ష్యాలు జన్మభూమి కమిటీల చేతిలోనికే చేరినట్టు తెలుస్తోంది. ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత వారికి అప్పగించడంవల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల అప్పుడే వీటికోసం బేరాలు కూడా సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement