ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల జాతర మొదలైంది. వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో 136 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 53 వీఆర్వో, 83 వీఆర్‌ఏ పోస్టులు భర్తీ చేయనుంది. రాత పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. వీఆర్వో వేతనం రూ.7,520, వీఆర్‌ఏ గౌరవ వేతనం రూ.3వేలతోపాటు అలవెన్స్‌లు ఇస్తారు. విద్యావంతులు తహశీల్దార్ కేడర్ వరకు పదోన్నతి పొందవచ్చు. చాలా రోజులుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేకపోవడంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతతో నిర్వహిస్తున్న ఈ పోస్టులకు డిగ్రీ, పీజీ, బీఈడీ, బీటెక్ తదితర ఉన్నత విద్యావంతులూ దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాత పరీక్షకు మరికొద్ది రోజులే సమయం ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే ఉద్యోగం మీ సొంతమవుతుంది. - న్యూస్‌లైన్, మంచిర్యాల అర్బన్/ఆదిలాబాద్ టౌన్ గ్రామానికి అధికారి.. వీఆర్వో
గ్రామానికి తొలి అధికారి వీఆర్వో(గ్రామ రెవెన్యూ అధికారి)నే. గ్రామాల్లోని ప్రజల సమస్యలపై మొదటగా స్పందించాల్సింది వారే. తుపాన్, కరువు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, ఉన్నతాధికారులను సంప్రదించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం, నష్టాన్ని నిబంధనల ప్రకారం లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, వివరాలు వారి వద్దనే ఉంటాయి. నీటి తీరువా, భూమి శిస్తు వసూలు, గ్రామ స్థాయిలో పంటల రకాలు, వాటి సరాసరి దిగుబడిపై అధికారిక సమాచారం కలిగి ఉండాలి.
వీఆర్‌ఏ.. వీరు వీఆర్వోలకు సహాయకులుగా వ్యవహరిస్తారు. వీఆర్వోల పనితీరు, ఖాళీల ఆధారంగా కేవలం పదేళ్లలోనే డెప్యూటీ తహశీల్దార్ స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. వీఆర్‌ఏగా చేరిన వారు సర్వీసు పూర్తయ్యేలాగా డెప్యూటీ తహశీల్దార్ వరకు పదోన్నతి పొందుతారు.
ఇవీ అర్హతలు
వీఆర్వో పోస్టులకు : కనీస విద్యార్హత రెండేళ్ల ఇంటర్మీడియెట్ గానీ, మూడేళ్ల డిప్లొమా కోర్సు గానీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్లలోపు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్ల వరకు సడలింపు ఉంది.
నిర్దేశించిన విద్యార్హత పూర్తయ్యే నాటికి వరుసగా నాలుగేళ్లపాటు జిల్లాలో చదివినవారు మాత్రమే ఇక్కడి పోస్టులకు అర్హులు.
వీఆర్‌ఏ పోస్టులకు..
కనీస విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి 18 నుంచి 37 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 42 ఏళ్లు, మాజీ సైనికులకు 40 ఏళ్లు, వికలాంగులకు 47 సంవత్సరాలు వరకు ఉండవచ్చు.
పరీక్ష రుసుం రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సంబంధిత రెవెన్యూ గ్రామ పరిధిలో నివాసులై ఉండాలి
షెడ్యూల్ వివరాలు...
నోటిఫికేషన్ జారీ : డిసెంబర్ 28
దరఖాస్తుకు గడువు : వీఆర్వో పోస్టులకు జనవరి 12, వీఆర్‌ఏ పోస్టులకు 13వ తేదీ
హాల్‌టికెట్ల జారీ : జనవరి 19 నుంచి ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు.
పరీక్ష తేదీ : ఫిబ్రవరి 2, 2014(వీఆర్వోలకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, వీఆర్‌ఏలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు )
ప్రాథమిక కీ విడుదల : ఫిబ్రవరి 4
తుది కీ విడుదల : ఫిబ్రవరి 10
ఫలితాల ప్రకటన : ఫిబ్రవరి 20
నియామక ఉత్తర్వులు జారీ : ఫిబ్రవరి 26
పరీక్ష ఫీజు..
ఓసీ, బీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150. వికలాంగులకు పూర్తిగా మినహాయింపు.
వీఆర్‌ఏ, వీఆర్‌వో పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 12 వరకు ఏపీ ఆన్‌లైన్, మీ సేవ, ఈ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్‌వో, మధ్యాహ్నం వీఆర్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారు.
ఇలా భర్తీ చేస్తారు..
వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులను జిల్లాల వారీగా కాకుండా యూనిట్‌లుగా విభజించారు. వీఆర్వో పోస్టులను జిల్లా యూనిట్‌గా, వీఆర్‌ఏ పోస్టులను రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భర్తీ చేస్తారు. వీఆర్వో పోస్టులకు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జిల్లాలో ఎక్కడైనా విధులు కేటాయిస్తారు. వీఆర్‌ఏ పోస్టులకు ఖాళీలున్న నిర్దేశిత రెవెన్యూ గ్రామాలకు చెందిన అభ్యర్థులనే అర్హులుగా పరిగణిస్తారు. వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గతంలో మండలంలోని ఏ గ్రామస్తులైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా ఆ నిబంధనను సవరించారు. రెవెన్యూ గ్రామం యూనిట్‌గానే భర్తీ చేయనున్నారు.
పరీక్షలు ఇలా..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వంద మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. రెండు పరీక్షలకు నెగెటివ్ మార్కులు లేవు. రెండింటికీ సిలబస్ ఒక్కటే అయినా ప్రశ్నల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో 60, అర్థమెటిక్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానం, ప్రభుత్వ పథకాలు, దేశ చరిత్ర, ఆంగ్లేయుల పాలన, తిరుగుబాటు, ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు, నాగరికత, ప్రాచీన యుగం, మధ్య యుగం ఇలా అనేక ప్రశ్నలు ఉంటాయి. వీఆర్వో ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యేవారు బాగా చదవాలి. అన్ని సబ్జెక్టుల్లో మార్కులు సాధించాలి. కఠోర సాధన చేయాలి. చదివినది గుర్తు పెట్టుకోవాలి.
నమూనా ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి
సమయం చాలా తక్కువగా ఉన్నందున నమూనా ప్రశ్నపత్రాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి పక్షం రోజులకు ఒకసారి నమూనా ప్రశ్నపత్రాలు తయారు చేసుకుని జవాబులు రాస్తూ మార్కులు, నైపుణ్యం స్థాయిని పరిశీలించుకోవాలి. తక్కువగా వస్తే మరింతగా సాధన చేయాలి. స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం కోచింగ్ తీసుకున్నా సమయం సరిపోదు. ఏపీ ఎకానమీ, జాగ్రఫి, 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. సిలబస్ మొత్తం పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రణాళికను సిద్ధం చేసుకుని చదవాలి. ఎక్కువగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పుస్తకాలు చదవాలి. దినపత్రికలు రోజు చదవడం అలవాటు చేసుకుంటే పరీక్షలకు సులువుగా ప్రిపేర్ కావచ్చు.
జిల్లాలో 136 వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు
Published Thu, Jan 2 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement