ఇక ఏటా వనమహోత్సవం
విశాఖ రూరల్ : ఇకపై ప్రతి సంవత్సరం వనభోజనాలను ప్రభుత్వపరంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం వుడా కైలాసగిరిని సందర్శించిన సీఎం అక్కడ డ్వాక్రా మహిళలతో కలిసి వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం నాల్గో సోమవారం చాలా దివ్యమైన రోజని, కైలాసగిరిపై వనభోజనాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వనభోజనాలంటే చెట్లకు పూజ చేస్తారని, చెట్ల కింద కూర్చొని భోజనం చేయాలని, ఆ విధంగా ప్రకృతిని ప్రేమించడం మన సంప్రదాయమన్నారు.
ప్రతి చోటా వన భోజనాలు చేసుకోవాలని, గ్రామంలోని ప్రజలందరూ పా ల్గొనాలని పిలుపునిచ్చారు. చెట్లను నాటడం, వాటిని పెంచడం పవిత్ర కార్యమని చెప్పారు. డ్వాక్రా మహిళలు వనమహోత్సం, వనభోజన కార్యక్రమాల్లో పాల్గొని చెట్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. చెట్లను పెంచితే వర్షాలు బాగా కురుస్తాయని, గాలిలో ఆక్సిజన్ పెరుగుతుందని, ఎండలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఇది వరకే ఆ విషయాన్ని నిరూపించారని తెలిపారు. వారి కృషి మూలంగా జనాభా నియంత్రణ, అక్షరాస్యతలో అభివృద్ధి సాధించామన్నారు.
ప్రత్యేక కోర్సు: డ్వాక్రా సంఘాల మహిళల ఆదాయం పెంచుకొనేందుకు, స్త్రీల ఆరోగ్య రక్షణపై డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేకమైన కోర్సును ప్రవేశపెడతామని వెల్లడించారు. దానిపై పరీక్షలు కూడా నిర్వహిస్తామని, ఈ కోర్సులో డిగ్రీ వరకు చదువుకోవచ్చని చెప్పారు. కైలాసగిరిపై చెట్ల ప్రూనింగ్ చక్కగా చేశారని అధికారులను అభినందించారు.
గేట్ వేగా విశాఖ : సముద్ర తీర ప్రాంతంలో ఉన్న విశాఖతో పాటు తీర ప్రాంత పట్టణాలను గేట్‌వే ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మన రాష్ట్రం పల్లపు ప్రాంతంలో ఉం దని, పై రాష్ట్రాల నుంచి వచ్చిన గోదావరి, కృ ష్ణా, వంశధార, నాగావళి వంటి నదుల ద్వారా వచ్చిన నీరు ఎక్కువ భాగం వృథాగా సముద్రంలో కలిసిపోతుందని తెలిపారు. ఒక్క గోదావరిలోనే 500 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోందన్నారు.
ఆ నీటిని ఒడిసి పట్టి ఉపయోగించుకోవాలని సూచించారు. తద్వారా వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవచ్చని వివరించారు. ప్రజా చైతన్యం ద్వారానే ఇవి సాధ్యపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.నారాయణ, సిహెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.