ఇకపై మార్కెట్‌లో ఈ టెండర్లు | now onwards e-tenders in markets | Sakshi
Sakshi News home page

ఇకపై మార్కెట్‌లో ఈ టెండర్లు

Published Fri, May 30 2014 1:31 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను వినియోగించుకుని మార్కెట్‌యార్డుల్లో క్రయ, విక్రయాల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంటోంది.

ఆదోని, న్యూస్‌లైన్ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను వినియోగించుకుని మార్కెట్‌యార్డుల్లో క్రయ, విక్రయాల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఈ-టెండర్ల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ర్టంలోని ప్రధాన మార్కెట్‌లలో ఒక్కటైన ఆదోని యార్డును మోడల్‌గా తీసుకుని కొత్త విధానాన్ని ఈ సీజన్ నుంచే అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆదోనిలో విజయవంతం అయితే రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులకు దీన్ని   వర్తింపజే స్తారు.

 రహస్య టెండర్ల అమలులో పలు ఇబ్బందులు
 ప్రస్తుతం యార్డులో వ్యవసాయ దిగుబడుల కొనుగోలుకు రహస్య టెండర్ల విధానం అమలులో ఉంది. తమ షాపునకు వచ్చిన రైతుల దిగుబడులను కుప్పలుగా పోసి కమీషన్ ఏజెంట్లు లాట్ నంబర్లు వేస్తారు. దిగుబడుల నాణ్యతను పరిశీలించిన తరువాత వ్యాపారులు తాము కొనుగోలు చేయాలనుకున్న ధరను సంబంధిత కమీషన్ ఏజెంటు టెండర్ ఫారంలో నమోదు చేసి యార్డులో అధికారులు ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేస్తారు.

ఆదోనిలో రెండు వందల మంది వ్యాపారులు టెండర్లు రాస్తుండడంతో వాటన్నింటినీ పరిశీలించేందుకు చాలా ఆలస్యమవుతోంది. సీజన్‌లో రెండు నుంచి ఐదు విడతలుగా టెండర్లు నిర్వహిస్తారు. దీంతో చివరి టెండర్ల పరిశీలన పూర్తి చేసి ధరలు ప్రకటించేందుకు రాత్రి 8 గంటలు కూడా అవుతోంది. ఆ తరువాత తూకాలు పూర్తి అయ్యేందుకు తెల్లవారు జాము అవుతోంది.  కరెంట్ వెలుగులు సక్రమంగా లేకపోవడంతో తూకాల్లోనూ మోసాలు జరిగి రైతులు నష్టపోతున్నారు.

 ఈ-టెండర్లతో కష్ట, నష్టాలకు చెక్
 ఈ-టెండర్ల విధానం సక్రమంగా అమలైతే కష్ట, నష్టాలకు చెక్ పడుతుంది. యార్డులోని పది కమీషన్ ఏజెంట్ల దుకాణాలకు ఒక కంప్యూటర్ చాంబర్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఆదోని యార్డులో మొత్తం 25 వరకు చాంబర్లు ఏర్పాటు చేశారు. వాటిని యార్డు కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌తో అనుసంధానం చేశారు. వ్యాపారికి, కమీషన్ ఏజెంట్లకు ప్రత్యేక కోడ్ నంబర్లు కేటాయిస్తారు. కమీషన్ ఏజెంట్ తన కోడ్‌తో సైట్‌ను ఓపన్ చేసి షాపునకు వచ్చిన సరుకుల(లాట్‌ల) వివరాలు నమోదు చేస్తాడు.

తరువాత వ్యాపారి తన కోడ్‌తో తన సైట్‌ను ఓపన్ చేసి ఒక్కో లాట్‌ను ఏ ధరకు కొనుగోలు చేయాలనుకుంటున్నాడో నమోదు చేస్తారు. ధర నమోదు కాగానే ఫైల్ క్లోజ్ అవుతోంది. మళ్లీ ఓపన్ చేయాలంటే యార్డు అధికారుల సహకారం తీసుకోవాల్సి ఉంటోంది. దీంతో ఇతరులు ఎవ్వరూ ఆ సైట్‌ను ఓపన్ చేసుకోలేరు. ధరల నమోదుకు సంబంధించిన సమయం పూర్తయిన తర్వాత యార్డు సిబ్బంది కంప్యూటర్‌లో లాట్ నంబరు నమోదు చేయగానే ఏ వ్యాపారి ఎక్కువ ధరకు కోట్ చేశాడో ఆయన పేరు, నగదు అందులో మొదటి వరుసలో కనిపిస్తుంది. మిగిలిన వారి వివరాలు కింద ఉంటాయి.

అంటే వందల సంఖ్యలో టెండర్లు ఉన్నా నిమిషాల్లో పని పూర్తవుతుంది. ధర ఖారారు చేయగానే వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తమ సైట్‌లను ఓపన్ చేసుకుని వివరాలను చూసుకోవచ్చు. ఈ పద్ధతిలో మధ్యాహ్నంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత తూకాలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తూకాలు పూర్తి అయిన తరువాత తక్ పట్టీలను కూడా కమీషన్ ఏజెంట్లు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

 అధికారులు కేటాయించిన కోడ్‌తో తక్ పట్టీలను వెంటనే ప్రింట్ అవుట్ తీసుకుని రైతులకు ఇవ్వాలి. యార్డు అధికారులు కేటాయించిన ప్రత్యేక నంబరుతో కూడిన గేట్ పాస్‌ను వ్యాపారులు కంప్యూటర్ నుంచి ప్రింట్ అవుట్ తీసుకుని కొనుగోలు చేసిన దిగుబడులను గోదాములకు తరలించుకోవచ్చు. దీంతో నకిలీ గేట్ పాస్ అక్రమాలకు అడ్డుకట్టపడుతోంది. యార్డులో సకాలంలో సెస్సు చెల్లించ ని వ్యాపారులు, లావాదేవీల వివరాలను సమర్పించని కమీషన్ ఏజెంట్ల సైట్‌లను అధికారులు లాక్ చేస్తారు. వారికి టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. దీంతో ఇక మీదట సెస్సు వసూలు కూడా మరింత సులభం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement