గుంటూరు (తెనాలిఅర్బన్): రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజలకు మరింత సులభతరమైందని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చిందని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ బి.సూర్యనారాయణ చెప్పారు. తెనాలిలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన సబ్ రిజ్రిస్టార్లతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా నిర్ధేశించిన ఆదాయ లక్ష్యంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొద్ది కాలంగా స్టాంపు పేపర్ల కొరత ఉందన్నారు.
అయితే రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్‌తో మాట్లాడి ఈ సమస్యను అధికమించామన్నారు. స్టాంపు పేపర్లు పుష్కలంగా సరఫరా అయ్యాయని, వాటిని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందజేస్తామన్నారు. దాదాపు ఆరు నెలల వరకూ స్టాంపు పేపర్లకోసం వెతుక్కోవాల్సిన పని ఉండదన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైనా, ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉందన్నారు. ఈ ప్రక్రియలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది ప్రజలకు పూర్తి సహకారం అందించేందుకు సిద్దమన్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని మార్చి నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు.
ఇక అన్ని జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు
Published Wed, Feb 25 2015 9:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement