ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి
ఘనంగా ఎన్‌ఎస్‌యూఐ వ్యవస్థాపక దినోత్సవం
విజయవాడ సెంట్రల్ : రాజకీయాలపై విద్యార్థులు వాచ్‌డాగ్స్ పాత్ర పోషించాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ 44వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం ఆంధ్రరత్న భవన్‌లో ఘనంగా జరిగింది. తొలుత ఎన్‌ఎస్‌యూఐ జెండాను రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రాజకీయాలు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. ఎన్నికల్లో టికెట్ తెచ్చుకునే దగ్గర నుంచి గెలుపు వరకు డబ్బే శాసిస్తోందని, ఈ పరిణామం ప్రమాదకరమన్నారు. దీన్ని మార్చే శక్తి విద్యార్థులకే ఉందని తెలిపారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా విద్యార్థులు కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు. గడిచిన 20 ఏళ్లుగా విద్యార్థులు సామాజిక బాధ్యత నుంచి తప్పుకొంటున్నారని, కార్పొరేట్ విద్యావిధానంలో చదవడం, మార్కులు సాధించడంతోనే విద్యార్థులు కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకుంటే యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టి మహోద్యమాన్ని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని, పోలవరం పూర్తయితే రాష్ట్రం సుభిక్షం అవుతుందని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ కళాశాలలను మూసివేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, గుంటూరు జిల్లాలో 17 హాస్టళ్లను మూసివేయాలనే ప్రతిపాదన చేసిందని రఘువీరారెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమల్లోకి తెచ్చాక ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారని తెలిపారు. హాస్టళ్లు, కళాశాలల మూసివేతపై విద్యార్థులు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పరసా రాజీవ్ రతన్, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు వాచ్‌డాగ్స్ పాత్ర పోషించాలి
Published Fri, Apr 10 2015 4:39 AM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM
Advertisement