జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా సూచన
మడకశిర : టీడీపీ ప్రజాప్రతినిధులు త్వరలో చేపట్టబోయే ఢిల్లీ పర్యటనలో జిల్లా ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సూచించారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రధాన అభివృద్ధి పనులకు నిధులు సాధించడానికి కృషి చేయాలన్నారు. జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి నిధులు సాధించడానికి ఢిల్లీ పర్యటన చేపట్టడం అభినందనీయమంటూనే పలు సూచనలు చేశారు. ముఖ్యంగా జిల్లాలో రెండో విడత హంద్రీనీవా పనులు 2016లోగా పూర్తి చేయడానికి రూ.3వేల కోట్లు అవసరం అన్నారు.
జిల్లాలో హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణ పనులు 60శ ాతం పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన 40శాతం పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ రెండిటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు మంజూరు చేయించేందుకు వారు ఒత్తిడి చేయాలన్నారు. జిల్లాకు ఎంతో ఉపయోగపడే వరదనీటి కాలువ చేపట్టడానికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడటానికి కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు.
అదేవిధంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టలేదని ఈ నియోజకవర్గంలో కూడా ఈ పథకాన్ని చేపట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మిగిలిన గ్రామాలకు తాగునీరు సరఫరాకు పథకాలు చేపట్టడానికి కేంద్రం నుండి నిధులు రాబట్టాలని కోరారు.
జిల్లాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురాన్ని డెజర్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (డీడీపీ) కింద జిల్లాను ఎంపికచేసి రూ.400కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయించామని, అలాగే మరోసారి డీడీపీ ప్రతిపాదనలు రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విభజన చట్టంలో రాయలసీమ, ఉత్తరకోస్తాల్లో బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24 వేలకోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉందని, ఇందులో జిల్లాకు రూ.4వేల కోట్లు రావాల్సి ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం రూ.50కోట్లే మంజూరు చేసిందన్నారు. మిగిలిన నిధులను మంజూరు చేయించాలన్నారు.
ఢిల్లీకి ముఖ్యమంత్రిని తీసుకెళ్లి పీఎంతో మాట్లాడి ప్రాజెక్టు అనంతను మంజూరు చేస్తే జిల్లాలో శాశ్వతంగా కరువును నివారించడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, స్థానిక నాయకులు ఎస్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ రవిశంకర్, మంజునాథ్, ఎస్‌ఎన్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సమస్యలపై దృషి పెట్టండి
Published Sat, Jun 13 2015 2:55 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement