డిస్కంలపై ప్రై‘వేటు’ పడగ!
' ఫ్రాంచైజీల పరం కానున్న విద్యుత్ పంపిణీ
' చంద్రబాబు బాటలో కిరణ్ సర్కార్
' తన హయూంలో మీటరింగ్, బిల్లింగ్ సేవలను ప్రైవేటుకప్పగించిన చంద్రబాబు
' తాజాగా బిల్లు వసూళ్లు, కొత్త లైన్లు, కనెక్షన్ల బాధ్యతలూ ప్రైవేటు కంపెనీలకే
' 10 నుంచి 12 ఏళ్ల పాటు కాంట్రాక్టుకు అవకాశం
' త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం
' తొలి విడత చార్మినార్, బేగంబజార్, రాయచోటి, భీమవరం, నిజామాబాద్ జోన్లలో అమలుకు రంగం సిద్ధం
కె.జి.రాఘవేంద్రరెడ్డి, సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ ప్రైవేటుసంస్థల పరం కానుంది. తొలివిడతగా రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఫ్రాంచైజీ విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. సీపీడీసీఎల్ పరిధిలోని చార్మినార్, బేగం బజార్, ఎస్‌పీడీసీఎల్ పరిధిలో రాయచోటి, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో నిజామాబాద్, ఈపీడీసీఎల్ పరిధిలోని భీమవరంలో విద్యుత్ పంపిణీ ప్రక్రియ యూవత్తూ ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు ఆయూ ప్రాంతాల్లో పంపిణీ నష్టాలు అధికంగా ఉన్నాయంటూ సాకు చెబుతోంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తొలుత ఐదు జోన్లకే పరిమితమైనా విడతలవారీగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ ఈ విధానాన్ని వర్తింపజేసే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. అరుుతే డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఆర్థిక నష్టాల సాకు
దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆర్థికనష్టాల్లో ఉన్నాయి. విద్యుత్ సరఫరా మేరకు బిల్లులు వసూలు కాకపోవడాన్ని పంపిణీ నష్టంగా పేర్కొంటున్నారు. ఈ పంపిణీ నష్టాల నుంచి డిస్కంలను బయటపడేసేందుకు ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీని కింద డిస్కంల రుణాల్లో సగం మొత్తానికి కేంద్రం, మిగిలిన సగానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వడ్డీ భారాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం భరిస్తారుు. కానీ ఈ ప్యాకేజీ వర్తించాలంటే విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం షరతు విధించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఫ్రాంచైజీ విధానాన్ని అమలు చేస్తామని 2014 జనవరి 1న జరిగిన ఒప్పందం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే రుణ భారం తగ్గించే పేరిట విద్యుత్ పంపిణీ వ్యవస్థను మొత్తం ప్రైవేట్‌పరం చేసేందుకు రంగం సిద్ధం చేయడాన్ని విద్యుత్‌రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
మళ్లీ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో..!
చంద్రబాబు తన హయూంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ)గా ఉన్న రాష్ట్ర విద్యుత్ రంగాన్ని జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల పేరిట మూడు ముక్కలు చేశా రు. డిస్కంలను క్రమంగా ప్రైవేటీకరించాలనేది అప్పట్లోనే బాబు ఎజెండా. అరుుతే విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు ఫ్రాంచైజీల రూపంలో అప్పగించాలని ప్రపంచ బ్యాంకు నిర్దేశించింది. ఈ మేరకు మీటరింగ్, బిల్లింగ్ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు అప్పగించారు. 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పూర్తిగా పక్కకు పెట్టేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విద్యుత్‌రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే అభివృద్ధి చేశారు. కానీ తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ చంద్రబాబు బాట పట్టింది. ప్రపంచబ్యాంకు షరతుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఫ్రాంచైజీలకు అప్పగించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.
ఫ్రాంచైజీల పంజా..!
ఫ్రాంచైజీ విధానం అంటే పూర్తిగా ప్రైవేట్ సంస్థల రాజ్యమే. ఈ విధానంలో మీటరింగ్, బిల్లింగ్‌తో మొదలు బిల్ కలెక్షన్, నెట్‌వర్క్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం), కొత్త లైన్ల ఏర్పాటు, కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు వంటి బాధ్యతలన్నీ ఎంపికచేసిన ప్రైవేట్ సంస్థలకే అప్పగిస్తారు. సంబంధిత జోన్‌లో ప్రస్తుతం యూనిట్‌కు సగటున ఎంత ఆదాయం వస్తుందో లెక్కిస్తారు. అంతకంటే ఎక్కువ ధర చెల్లించే కంపెనీకి విద్యుత్ పంపిణీ బాధ్యతలను అప్పగిస్తారు. అంటే ఈ ప్రాంతంలో సదరు బాధ్యతలన్నిటి నుంచి ప్రభుత్వం వైదొలుగుతుంది. అంటే డిస్కంల పాత్ర పరిమితమవుతుంది. ఒప్పందం మేరకు 10- 20 ఏళ్ల వరకు ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఈ కాలాన్ని మళ్లీ పొడిగించే అవకాశమూ ఉంటుంది. సరఫరా చేసిన విద్యుత్ మొత్తానికి బిల్లులు రాబట్టడమే లక్ష్యంగా ఫ్రాంచైజీలు పనిచేస్తారుు.
ఉత్తరప్రదేశ్‌లో ఫెరుుల్..!
- పంజాబ్‌లో ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ ఇంజనీర్లే స్వయంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించారు. దాంతో అక్కడ ఇప్పుడు ఫ్రాంచైజీ విధానం అమలు నిలిచిపోయింది.
- ఫ్రాంచైజీ విధానం ఉత్తరప్రదేశ్‌లో విఫలమయ్యింది. నష్టాలు తగ్గకపోగా ప్రైవేటు సంస్థలు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు డిస్కంలకు సరిగ్గా చెల్లించడం లేదు.
- ఫ్రాంచైజీ విధానం అమల్లోకి వస్తే డిస్కంల ఉద్యోగులు ఆయూ ప్రాంతాల్లో విధుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వీరిని ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది ప్రశ్న.
- ఫ్రాంచైజీ విధానంలో ప్రభుత్వం వివిధ వర్గాలకు సబ్సిడీని ప్రైవేటు సంస్థలకు ముందుగానే చెల్లిం చాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ప్రభుత్వం ఆలస్యం చేస్తే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జోన్ల వారీగా పంపిణీ నష్టాలు (శాతాల్లో)
జోన్ పేరు పంపిణీ నష్టాలు
చార్మినార్ 58.00
బేగంబజార్ 38.00
రాయచోటి 12.66
నిజామాబాద్ 15.60
భీమవరం 13.10