దాహార్తి తీర్చేందుకే ఎన్టీఆర్ సుజల పథకం
- మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- గుంటూరులో మూడు ఆర్వో ప్లాంట్ల ప్రారంభం
గుంటూరు: పేదలకు సురక్షితమైన జలాన్ని తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నగరంలోని మూడు ప్రాంతాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను గురువారం ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ముఖ్యఅతిథి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు 20 లీటర్ల శుద్ధమైన జలాన్ని రూ.2 కే అందించే ఏర్పాటు చేశామని చెప్పారు.
రాజీవ్‌గాంధీనగర్‌లోని నగరపాలకసంస్థ పార్కులో నేరెళ్ళ వెంకటేశ్వర్లు, గిరిజాకుమారి సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించగా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా స్విచ్ ఆన్ చేశారు. ఎన్జీవో కాలనీలో కొత్తూరు కళానిధి సహకారంతో నెలకొల్పిన ఆర్వో ప్లాంటును గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రారంభించగా, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్విచ్ ఆన్ చేశారు. స్వర్ణాంధ్రనగర్‌లో ఎల్‌వీఆర్ అండ్ సన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించి స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే, నగరపాలకసంస్థ కమిషనర్ పి.నాగవేణి, అధికారులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.