సాక్షి, కడప: ఇలా విషజ్వరాల దెబ్బకు రోజుల తరబడి వైద్యం తీసుకుంటున్నవారు...ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నవారు చాలామంది ఉన్నారు. ఓవైపు దోమల తీవ్రత...మరో వైపు వాతావరణంలోని మార్పులతోనే విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 218 విషజ్వరాలు, 258 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ కాకిలెక్కలని వాస్తవ సంఖ్య వేలల్లోనే ఉందని తెలుస్తోంది. విషజ్వరాల దెబ్బకు జనాలు అల్లాడుతున్నా, గతేడాది విషజ్వరాలు, డెంగీ దెబ్బకు దాదాపు 40మంది ప్రాణాలు కోల్పోయినా ఈ ఏడాది అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కనీసం దోమల నివారణకు ఫాగింగ్ కూడా చేయడం లేదు.
ఇంత నిర్లక్ష్యమా?:
జిల్లాలో దోమలు స్వైర విహారం చేసే సీజన్‌లో పల్లెల్లో, పట్టణాల్లో ఫాగింగ్ చేయడం తప్పనిసరి. ఈ ఏడాది ఫాగింగ్ కోసం మలేరియా నియంత్రణ శాఖకు 1210 లీటర్ల మలాథియాన్’ ద్రావణం వచ్చింది. వాస్తవానికి జిల్లాలో ఫాగింగ్ చేసేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ 190 లీటర్లు మాత్రమే జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసినట్లు మలేరియా నియంత్రణ అధికారులు చెబుతున్నారు. పైగా తీసుకుపోయిన ద్రావణంతో అక్కడక్కడా కొంతమంది మాత్రమే ఫాగింగ్ చేశారు. తక్కినవారు పూర్తిగా ద్రావణాన్ని మూలనపడేశారు. జిల్లాకు ఏమేరకు మలాథియాన్ అవసరం? తీసుకెళ్లినవారు ఫాగింగ్ చేస్తున్నారా? లేదా? తక్కినవారు ఎందుకు ద్రావణాన్ని తీసుకెళ్లలేదు అనే అంశాలపై ఆరా తీసే అధికారే కరువయ్యారు. దీన్ని పర్యవేక్షించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరింత నిర్లిప్తంగా ఉన్నారు.
పల్లెల్లో వైద్యశిబిరాలు ఎక్కడ?:
జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్‌సీ(ప్రెమరీ హెల్త్ సెంటర్)లు ఉన్నాయి. 448 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. వీటి పరిధిలోని ఏఎన్‌ఎంలు సరిగా విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. సబ్‌సెంటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలుస్తోంది. వీరితో పాటు రోగాలబారిన పడి పల్లెవాసులు అల్లాడుతుంటే, గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి చికిత్స చేయడంలో కూడా పీహెచ్‌సీలు నిర్లిప్తంగా ఉన్నాయి. రోగులు పల్లెల నుంచి ఆస్పత్రుల వద్దకు వస్తే అక్కడ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఉదయం 9-12 గంటల వరకూ ఓపీ సమయం ఉంటే చాలా చోట్ల 10.30 గంటల వరకూ డాక్టర్లు రాని పరిస్థితి. పైగా మధ్యాహ్నం 12 గంటలకే వారు ఇంటిదారి పడుతున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ నర్సులు మాత్రమే ఆస్పత్రిలో ఉంటారు.
ఈ సమయంలో జ్వరం వచ్చిందని రోగులు ఆస్పత్రులకు వెళితే మాత్రలు చేతిలో పెట్టడం లేదంటే ఇంజక్షన్ వేస్తున్నారు. దీనికి కూడా నీడిల్, సిరంజి బయట నుంచి రోగులు తెచ్చుకోవాల్సిన స్థితి. ఇటీవల బడ్జెట్ నేరుగా పీహెచ్‌సీల ఖాతాలోకి వెళుతోంది. అయినా చాలా చోట్ల ఆస్పత్రికి అవసరమయ్యే మందులు కొనుగోలు చేయడ ం లేదు. ఇదేంటని డీఎంఅండ్‌హెచ్‌ఓను ప్రశ్నిస్తే ‘ఆస్పత్రులకు ఏయే మందులు అవసరమో డాక్టర్లే కొనుగోలు చేస్తుంటారు. ఆ వివరాలు నాకు తెలీవు?’ అని బాహాటంగానే చెబుతున్నారు. దీన్నిబట్టే సర్కారు ఆస్పత్రుల్లో వైద్యసేవలు ఎలా ఉన్నాయో ఇట్టే తెలుస్తోంది.
విలవిల
Published Wed, Dec 11 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement