100 ఎకరాలు నజరానా!
- సింగపూర్ సంస్థతో మాస్టర్ ప్లాన్ ఒప్పందం వెనుక భారీ డీల్
సాక్షి, హైదరాబాద్: రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక భారీ డీల్ ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చసాగుతోంది. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఉచితంగానే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇస్తోందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అసలు దీని వెనుక ఏముందా అనే అంశంపై ఆరా తీయగా కళ్లు చెదిరే విషయాలు బయటపడ్డాయి. రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న భూమిలో 2,000 ఎకరాల వరకు భూమిని రాజధాని నగరం కోసం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని.. అయితే వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించే భూమి మొత్తాన్ని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి.
వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా ఆ భూమిని అభివృద్ధి చేసే బాధ్యతలను పూర్తి స్థాయిలో సింగపూర్ కంపెనీకి అప్పగించనున్నారు. అంతేకాకుండా వాణిజ్య భూమిలో ఏకంగా 100 ఎకరాలను సింగపూర్ కంపెనీకి మాస్టర్ ప్లాన్ తయారు చేసినందుకు నజరానాగా ఇవ్వనున్నట్లు తేలింది. ఇటీవల సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన కొంత మంది ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి తెలియజేశారు. దీంతో అధికార యంత్రాంగం విస్తుపోయింది.
ఇప్పుడు రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఎకరం పది కోట్ల రూపాయల ఖరీదు పలుకుతోందని, వాణిజ్య అవసరాలకు తగినట్లు అభివృద్ధి చేస్తే ఎకరం 15 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంటే 1,000 కోట్ల రూపాయల నుంచి 1,500 కోట్ల రూపాయల విలువగల 100 ఎకరాలను సింగపూర్ కంపెనీకి కేటాయించనున్నట్లు తేలింది. ఈ విధంగా కేటాయింపులు చేయడం ద్వారా కొంత మంది పెద్దలకు తెరవెనుక భారీ ఎత్తున ప్రయోజనాలు కలగనున్నట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మాస్టర్ ప్లాన్ సింగపూర్ కంపెనీ రూపొందించినందున ఆ భూమి అభివృద్ధిని కూడా ఆ కంపెనీయే చేపడితే వ్యత్యాసాలు లేకుండా ఉంటుందనే సాకుతో ఆ కంపెనీకి అప్పగించడానికి ప్రభుత్వం ఎత్తు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ సమీకరణ కూడా అభివృద్ధి చేసే కంపెనీ చేపడుతుందని కూడా రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలకు లెసైన్స్‌లను కూడా మంజూరు చేసే అవకాశాన్ని చట్టంలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలకు భూ సమీకరణతో పాటు ఆ భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే పనులను అప్పగించనున్నట్లు స్పష్టం అవుతోంది.