► రాజధాని రోడ్ల నిర్మాణంలో ఎత్తులు, కుయుక్తులు
► సీడ్ కేపిటల్ రహదారి నిర్మాణానికి ఉరుకులు, పరుగులు
► ప్రతిపాదిత భూముల్లో ‘పెగ్ మార్కింగ్’ చేసిన అధికారులు
► సర్కారు దమననీతికి నిరసనగా పుల్లలు పీకేసిన రైతులు
► మరో వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ ఊసే ఎత్తని ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కక్ష సాధింపునకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. తన వారైతే ఓ విధంగా, రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులైతే మరోవిధంగా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు, మంత్రిమండలి, ఎంపీలు, ఎమ్మెల్యేలు... వాస్తవాలకు దూరంగా నడుస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రైతులను, అదీ తనకు నచ్చని వారిని వేధించడంలో ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారు. పన్నాగాలు పన్నడంలో పరిణతి చెందుతున్నారు. రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణ అంశాలను పరిశీలిస్తే ప్రభుత్వ దుర్మార్గాలు, ఎత్తుగడలు తేటతెల్లం అవుతాయి.
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : రాజధాని ప్రాంతంలో రోడ్ల వెనుక... సింగపూర్ నుంచి అందిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణం అత్యవసరమని చంద్రబాబు ఢంకా బజాయిస్తున్నారు. రాజధాని నగర ప్రాంతానికి చేరుకోవడానికి మరీ ముఖ్యమంటున్నారు. కనకదుర్గ వారధి దాటిన తరువాత మణిపాల్ ఆసుపత్రి సమీపం నుంచి రాజధాని నగర ప్రాంతం (సీడ్ క్యాపిటల్)దొండపాడు వరకు 20.3 కిలోమీటర్లు 60 మీటర్ల వెడల్పుతో యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మించాలని చెపుతున్నారు. అంతేకాక దీన్ని రెండుప్యాకేజీలుగా చేపట్టేందుకు రూ.500 కోట్లకు పైగా అంచనాలు రూపొందాయి.
ఉండవల్లి నుంచి దొండపాడు వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 242.30 కోట్లతో నాలుగు వరసల రహదారికి ప్యాకేజీ-1 కింద టెండర్లు పిలిచారు. ఇవి కాకుండా రాజధాని ప్రాంతంలో, రాజధాని నగర కేంద్రంలో ఆర్టియల్, సబ్ ఆర్టియల్, కలెక్టర్ రోడ్ల నిర్మాణానికి శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో కోణంలో పరిశీలిస్తే....
విజయవాడ పశ్చిమ బైపాస్ ఏమైంది?
జాతీయ రహదారి ఆరువరసల విస్తరణలో భాగంగా చినఅవుటపల్లి నుంచి కాజ వరకు 48 కిలోమీటర్ల మేర విజయవాడ పశ్చిమ బైపాస్‌గా నాలుగు వరసల రహదారి నిర్మాణానికి 2014 సెప్టెంబరులో ఒప్పందం కుదరింది. రూ.1680 కోట్లతో గామన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకున్న ఈ పనులను, ఒప్పందం కుదిరినప్పటి నుంచి 30 నెలల్లో పూర్తి చేయాలి. సెప్టెంబరు 2014 నుంచి పనులు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే వారు ‘గామన్ ఇండియా’ నుంచి ఉప కాంట్రాక్టు పొందారు. ఆస్ట్రేలియా కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని గత ఏడాదిన్నరగా చెపుతూనే వస్తున్నారు. బైపాస్ పనులు వేగంగా చేయడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, గుత్తేదారును తన వద్దకు పంపాలని, వారి సంగతి తేల్చేస్తానని ఆయన వందిమాగధులు, అనుకూల మీడియా పలుదఫాలు వెల్లడించింది. వాస్తవంగా ఇప్పటివరకు పనులు జరుగుతున్న దాఖలాలు లేవు.
పశ్చిమ బైపాస్ ఏర్పాటైతే...
2014 సెప్టెంబరు నుంచి పనులు మొదలై 30 నెలల్లో అంటే 2017 మార్చి నాటికి పూర్తవ్వాలి. కొన్ని నెలలు ఆలస్యమైనా కనీసం ఆ ఏడాదికైనా పూర్తయ్యేది. సూరాయపాలెం- వెంకటపాలెం మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మాణం జరిగితే నూతన రాజధానికి అన్నివిధాలా దగ్గరి దారి ఉండేది. రాజధాని నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల వస్తువులను చేర్చడానికి సులువయ్యేది. గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగర ప్రాంతానికి చేరుకోవడానికి, అదేవిధంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరుల నుంచి కూడా సీడ్ క్యాపిటల్‌కు వెళ్లడానికి మెరుగైన మార్గమయ్యేది. ఈ రోడ్డు మార్గం గురించి చంద్రబాబు సర్కారు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు సరికదా కనీసం దృష్టి సారించిన దాఖలాలు లేవు. గామన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి ఉపగుత్తేదారుగా తనకు సంబంధించిన వారు ఉండడమే ఇందుకు కారణమని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
రాజధాని ప్రాంతంలో...
జాతీయ రహదారి నుంచి రాజధాని నగర ప్రాంతానికి 20.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. ప్రతిపాదిత రోడ్డు అలైన్‌మెంట్ పరిధిలోని తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన తొంభై శాతానికి పైగా రైతులు ఇప్పటివరకు భూములు ఇవ్వలేదు. ఒక్క తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోనే 50 ఎకరాలకు పైగా రోడ్డు నిర్మాణానికి అవసరమవుతోంది. తక్కిన రెండు గ్రామాల్లో మరో 60 ఎకరాలు కావాల్సి వస్తోంది. తాడేపల్లి మునిసిపాలిటీ, గ్రామం అసలు భూసమీకరణలో లేనేలేదు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు భూసమీకరణకు సహకరించని సంగతి తెలిసిందే. రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిత భూముల్లో పెగ్ మార్కింగ్’ (హద్దులుగా పుల్లలు నాటడం) చేయడాన్ని నిరసిస్తూ ఆ మార్కింగ్‌ను రైతులు తొలగించేశారు.
ఆ రైతులకు ప్రభుత్వం కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ దమననీతికి, దురుసుతనానికి నిరసనగానే తాము పెగ్ మార్కింగ్‌ను తొలగించినట్లు రైతులు బాహాటంగానే చెపుతున్నారు. సర్కారు తమను ఉద్దేశపూర్వకంగానే మానసికంగా వేధిస్తోందని, తమ హక్కులను కాలరాస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణానికి 2014 సెప్టెంబరులో ఒప్పందం కుదిరినా ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన ముందుకు రావడమంటే తమను ఇబ్బందుల పాల్జేయడానికి కాదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలను తాము ఎప్పటికప్పుడు సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళుతున్నామన్నారు.