మాస్టర్‌ప్లాన్‌పై రాజధాని గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులు అధిక భాగం రచ్చ రచ్చగా మారాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడంతో రైతుల సందేహాలు నివృత్తి చేయలేక అధికారులు తలలు పట్టుకున్నారు. రాజధాని భూ సమీకరణకు తొలిగా ముందుకు వచ్చిన తుళ్లూరులో సైతం రైతులు సదస్సును బహిష్కరించడం మాస్టర్‌ప్లాన్‌పై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టింది.
గుంటూరు : సింగపూర్ సంస్థలు రూపొందించిన రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులు గురువారంతో ముగిశాయి. వివాదాల కారణంగా నిలిచిపోయిన సదస్సులను శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మాస్టర్‌ప్లాన్ విడుదల చేసిన రోజు నుంచి నెల రోజుల వరకు గడువు ఉండడంతో ఈ నెల 26 వరకు సీఆర్‌డీఏ కార్యాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు.
గత నెల 25న ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను విడుదల చేసింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 6న గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్, సీఆర్‌డీఏ కమిషనర్, ఇతర అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే సదస్సులు గ్రామాల్లో నిర్వహించాలని రైతులు డిమాండ్ చేయడంతో షెడ్యూల్ ప్రకటించి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. భూ సమీకరణకుమద్దతు పలికిన తుళ్ళూరు గ్రామ రైతులు కూడా గురువారం సదస్సును బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ప్రతీ సదస్సులో రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులు, గ్రామ కంఠాల పరిధిలోని ప్రజలు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజధాని గ్రామాల మధ్య నుంచి ఆరు వరుసల రహదారులు, కోర్ కేపిటల్ నిర్మాణం జరగనున్న మూడు గ్రామాల గురించి, జరీబు రైతుల నష్టపరిహారం, గ్రామ కంఠాలు తదితర అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో వారంతా అభ్యంతర పత్రాలను ఇచ్చారు.
యర్రబాలెం, నవులూరు, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల మధ్యలో ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దానివల్ల గ్రామాలు రెండుగా విడిపోవడమే కాకుండా నివాసాలు కూడా కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నివాసాల నిర్మాణానికి రెట్టింపు మొత్తం ఇస్తామని అధికారులు ముందుకు వచ్చినా, సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని వదులుకునే ఉద్దేశం లేక రైతులు ఆరులైన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అభ్యంతర పత్రాలు ఇచ్చారు.
సాలీనా మూడు పంటలు పండుతున్న భూములు కలిగిన జరీబు రైతులు తమకు ఇచ్చే నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇప్పుడు ఈ సదస్సులకు హాజరుకావడం లేదని, భవిష్యత్‌లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనని, అందుకనే మాస్టర్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లించనున్న నష్టపరిహారం, ఇవ్వనున్న నివేశన స్థలాలు, భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతులు వంటి ముఖ్య అంశాలకు చట్టబద్ధత కల్పించి ప్రతీ రైతుకు అందించాలని కోరారు.
రాజధానిలో 29 గ్రామాలకు అనుబంధంగా ఉన్న గ్రామ కంఠాల విషయంలో మంత్రులు, అధికాారులు ఎంతో హైడ్రామా నడిపారని, గ్రామ కంఠాలు ప్రకటించలేదని, దీని వల్ల స్థలాలను అమ్ముకునే అవకాశాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కోర్ కాపిటల్ నిర్మాణం జరగనున్న ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల పరిధిలో అధికారులు ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ మూడు గ్రామాల్లో పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. దీనిని అమలులోకి తీసుకువస్తే, ఆ గ్రామాలు పూర్తిగా గల్లంత వుతాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలంతా ఐక్యంగా మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నగరాలకు సమీపంలోని వ్యవసాయ భూములను గ్రీన్‌బెల్ట్ పరిధిలోకి తీసుకురావడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో పోరంకి, ఈడుపుగల్లు, గన్నవరం మండలాలు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, కొల్లిపర మండలాలు తదితర ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే అపార్టుమెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రీన్‌బెల్టును అమలు లోకి తీసుకువస్తే ఈ గ్రామాల్లో ఇక నిర్మాణాలు పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుంది. ఈ గ్రామాలను గ్రీన్‌బెల్టు పరిధిలోకి తీసుకురావడంతో ఇప్పటికే అక్కడి భూముల ధరలు అనూహ్యంగా పడిపోయాయి. మున్ముందు ఇంకా పడిపోయే అవకాశం ఉండడంతో ఆ గ్రామాల రైతులు మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతటా ఆందోళనలు
రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై తొలుత మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో అవగాహనా సదస్సు నిర్వహించగా గ్రామకంఠాలను నిర్ధారించిన తరువాతే కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు ఆందోళన చేశారు.కురగల్లులో గ్రామకంఠంతో పాటు అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని, భూమిలేని రైతులు, రైతు కూలీల పింఛన్లలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ అధికారులను నిలదీశారు. నవులూరులో ఎక్స్‌ప్రెస్ వేల పేరుతో నివాస గృహాలు తొలగించవద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
నిడమర్రులో తమ గ్రామాన్ని రాజధాని నిర్మాణం నుంచి మినహాయించాలని పంచాయతీలో తీర్మానం చేసి అధికారులకు పంపినా పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదస్సును బహిష్కరించారు. యర్రబాలెం గ్రామంలో ఎక్స్‌ప్రెస్ వేల పేరుతో నివాసాలు తొలగించవద్దని, గ్రామ కంఠాలు నిర్ధారించకుండా మాస్టర్ ప్లాన్ ఎలా తయారు చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు.
బేతపూడిలో గ్రామకంఠాలు నిర్ధారించిన తరువాతే సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెంలో మెట్ట, జరీబు భూములకు ఒకే విధమైన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో భూ సమీకరణకు భూములు ఇవ్వకపోయినా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా భూములు చూపించారని ప్రశ్నించారు. ఉండవల్లిలో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా తమ గ్రామం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం వుందని, రోడ్లు డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు.
అభ్యంతరమే!
Published Fri, Jan 22 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement