ధర్మవరం టౌన్/తాడిమర్రి, న్యూస్‌లైన్ : ప్రకృతి ప్రకోపానికి, పాలకుల నిర్లక్ష్యానికి గురై అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలపై బ్యాంకర్లు కూడా జాలి చూపడం లేదు. పంట రుణాలు గడువులోపు చెల్లించలేదనే నెపంతో నోటీసులు జారీ చేసి... వేధింపులకు గురి చేస్తున్నారు. తాడిమర్రి మండలంలో దాదాపు 800 మంది రైతులకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ- తాడిమర్రి శాఖ) అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగేళ్లుగా మండలంలో సాధారణ వర్షపాతం 970 మిల్లీమీటర్లకు గాను సగటున 469 మి.మీ.మాత్రమే నమోదైంది. ఏ గ్రామంలోనూ పంట పెట్టుబడి కూడా రైతులకు దక్కలేదు. భూగర ్భజలాలు దాదాపు 150 అడుగులకు పడిపోయాయి. ఇది వరకు ఏడు గంటల కరెంట్‌తో మూడు ఎకరాలు సాగయ్యే బోరు బావి కింద ప్రస్తుతం అరెకరా కూడా సాగు కావడం లేదు.
అక్కడక్కడా పండిన కాస్తోకూస్తో పంట కూడా ఇటీవల భారీ వర్షాలకు నాశనమైంది. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణాలను రైతులు సకాలంలో చెల్లించలేకపోయారు. అయినా బ్యాంకు అధికారులు కనికరం చూపడం లేదు. ఈ నెల 23న లోక్‌అదాలత్‌కు హాజరై... రుణాలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈయన కాటమరెడ్డి. తాడిమర్రి మండలం మోదుగులకుంట వాసి. 2009లో తనకున్న మూడెకరాల భూమిని తాకట్టుపెట్టి తాడిమర్రి ఎస్‌బీఐలో రూ.30 వేల పంట రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్క పంట కూడా పండలేదు. దీంతో రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. బ్యాంకు అధికారులు మాత్రం రూ.60 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
రుణాల రికవరీకి నోటీసులిచ్చాం : బలరామ్‌నాయక్, ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్, తాడిమర్రి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుణాల రికవరీ కోసం రైతులకు నోటీసులు జారీ చేశాం. ఈ నెల 23న లోక్‌అదాలత్‌కు హాజరు కావాలని సూచించాం.
నేడు బ్యాంకు ముట్టడి
తాడిమర్రి ఎస్‌బీఐ బ్రాంచ్ అధికారుల వైఖరిని నిరసిస్తూ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బ్యాంకును ముట్టడిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులు పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి, మల్లప్పగారి కేశవరెడ్డి, అల్లే శివారెడ్డి, బాలం శేఖరరెడ్డి, పక్కీరారెడ్డి తెలిపారు. కరువు ఉన్నా రైతులు రుణాలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ప్రతి రైతు, వ్యవసాయకూలీ హాజరై బ్యాంక్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
దారుణాలు
Published Mon, Nov 18 2013 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement