సాక్షి, కర్నూలు: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామనే ఆర్టీసీ వాగ్దానం నీరుగారుతోంది. కాలం తీరిన బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోతుండగా.. ఇటీవల కాలంలో ప్రమాదాలు కూడా అధికమవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన సంస్థ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. బస్సుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సింది పోయి.. షెడ్యూళ్లలో మార్పు చేయడం గమనార్హం. ఈ మేరకు రెండు నెలల కిందట జారీ చేసిన ఉత్తర్వులు ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉత్తర్వులను రాష్ట్రంలోని 23 డిపోల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. ఆరు నెలల తర్వాత అన్ని డిపోల్లో అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో బస్సుల పనితీరును పరిశీలిస్తే.. నిత్యం ఐదారు బస్సులు మార్గమధ్యంలో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఇక్కట్లకు లోనవుతున్నారు.
ప్రమాదాలు కూడా ఇదే స్థాయిలో ఉంటున్నాయి. రోజువారీ సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తుండగానే ఈ పరిస్థితి ఉండగా.. తాజాగా షెడ్యూల్ మార్పుతో ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతుందోనని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంజిన్ కూలింగ్ పరిశీలన, లీకేజీలు, ఈసీయూ లోపాలు, ఇంజిన్ మరమ్మతులు, ఇంధన ట్యాంకు, పైపులు, విడిభాగాల పరిశీలన, యాంకర్లు సరిచేసుకోవడం తదితరాలను కిలోమీటర్ల ప్రాతిపదికన చేపడతారు. ఇద్దరు మోకానిక్‌ల ఆధ్వర్యంలో దాదాపు 10 గంటల పాటు క్షుణ్ణంగా వీటిని తనిఖీ చేయాల్సి ఉంది. డీలక్స్ ఆపై కేటగిరీ బస్సులకు 15వేల కిలోమీటర్ల తర్వాత, ఆర్డినరీ బస్సులకైతే 12వేల కిలోమీటర్లకు తనిఖీ నిర్వహిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో డీలక్స్ తదితర బస్సులకు 24వేల కిలోమీటర్లు, పల్లె వెలుగు బస్సులకు 16వేలు, సిటీ బస్సులకు 12వేల కిలోమీటర్లుగా తనిఖీ సమయాన్ని నిర్ణయించారు.
బస్సుల్లో కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ స్థాయి, ఆయిల్ లీకేజీలు, కూలెంట్ హోసులు, బ్రేక్ హోస్ పైపులు, స్టీరింగ్ ఆర్మ్స్, స్ప్రింగ్‌లీవ్‌ల బ్రేకేజీ, స్ప్రింగ్ బ్రాకెట్స్, షాకిల్స్, ఎయిర్ లీకేజీ, బేరింగ్‌ల స్థితి, నట్లు, బోల్టుల స్థితి, టైర్ల పరిశీలన తదితరాలను రోజూ పరిశీలిస్తుండగా.. రోజు విడిచి రోజుకు మార్పు చేశారు. సర్వీస్ ఇండికేటర్ల పరిశీలన, అవసరమైన భాగాలకు గ్రీజు పట్టించడం, స్పీడ్ సెన్సర్లను శుభ్రపరచడం, ఈఎంఆర్ తనిఖీ, వీల్ అలైన్‌మెంట్, రూఫ్ లైట్లు, బాడీ మరమ్మతులు, టైర్లను మొత్తం తొలగించి మళ్లీ అమర్చడం, బ్యాటరీ పరిశీలన తదితరాలను వారానికోసారి చేపడుతుండగా.. ఇకపై పది రోజులకోసారి చేయమని ఆదేశించారు.
రాకర్ ఆర్మ్‌లు, థర్మోస్టాట్ ఉష్టోగ్రత, రేడియేటర్, ఇంజెక్టర్లు, ఎయిర్ కంప్రెషర్స్ తదితరాల నిర్వహణను సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ తదితర బస్సులకు గతంలో 35వేల కిలోమీటర్లు తర్వాత చేస్తుండగా.. ఇప్పుటి నుంచి 72వేల కిలోమీటర్లకు పెంచేశారు.
అదేవిధంగా పల్లెవెలుగు బస్సులకు 48వేల కిలోమీటర్లు, సిటీ బస్సులకు 36 వేల కిలోమీటర్లకు నిర్వహణ సమయాన్ని మార్పు చేయడం గమనార్హం. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ సిబ్బందే తప్పుపడుతున్నారు. ఇలాగైతే ప్రమాదాలను నివారించడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రయాణికుల రక్షణ పట్టని సంస్థ
Published Mon, Nov 25 2013 3:02 AM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM
Advertisement
Advertisement