అధికార జులుం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ప్రభుత్వం మాది.. మీఇష్టమొచ్చినట్లు కాంట్రాక్టు పనులు చేయిస్తామంటే ఒప్పుకునేది లేదు. మేము చెప్పినోళ్లకు కాంట్రాక్టు పనులు అప్పగించాలి.. వీరిది చిలంకూరే. వీరి నేతృత్వంలోనే ఇకపై కాంట్రాక్టుపనులు చేపట్టాలి.
-ఐసీఎల్ యంత్రాంగంపై టీడీపీకి చెందిన ఓ ఎంపీ సోదరుడి హుకుం
అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడే కన్పించాయా.. సరదాగా పేకాట ఆడుకుంటుంటే పట్టుకొస్తారా... వెంటనే వారిని వదిలేయండి. కేసు నమోదు చేశారా.. మళ్లీ పొద్దున్నే వస్తారులే.. అంతలోనే కేసు పెట్టకపోతే ఏమౌతుంది. ఇకపై మావాళ్లను పట్టుకొస్తే సహించేది లేదు. మీకు తెలియకుండా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వస్తారా..
- పేకాటరాయుళ్లును విడిపించే క్రమంలో రాజంపేట పోలీసులపై ఓ ప్రజాప్రతినిధి హూంకరింపు
గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే పంధాను ప్రదర్శిస్తున్నారు. అధికారులపై పెత్తనం చలాయించేందుకు ముందు వెనుకా ఆలోచించడం లేదు. అసాంఘిక చర్యలైనా, ఆదాయవనరులైనా టీడీపీకి అండగా నిలవాల్సిందేనని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. పబ్లిక్ రంగ సంస్థలను సైతం శాసిస్తూ అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టగానే అనుకూలురైన అధికారుల కోసం దేశం నేతలు అన్వేషణ చేపట్టారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ శశిధర్, ఎస్పీ అశోక్‌కుమార్ రాజకీయ బదిలీ పర్వాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ అంశాన్ని సాకుగా పెట్టుకుని కింది స్థాయి యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా బెదిరిస్తున్నారు.
రాజంపేటలో విచ్చలవిడిగా జూదం...
డివిజన్ కేంద్రమైన రాజంపేటలో అసాంఘిక కార్యక్రమాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లో విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్నారు. అక్కడి యంత్రాంగానికి తెలిసినప్పటికీ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. మంగతై జూదంకు నిలయంగా ప్రస్తుతం రాజంపేట నిలుస్తోంది. ఈక్రమంలో గురువారం టీడీపీ నేత రామ్మోహన్‌నాయుడు సహా 24 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు.
వారి నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకోగా, రూ.3.5లక్షలు అధికారికంగా చూపారు. అయితే వారందరినీ రాత్రికిరాత్రే ఇంటికి పంపినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా రెండు గంటల వ్యవధిలో ఇంటికి పంపి శుక్రవారం ఉదయం పోలీసుస్టేషన్‌కు రప్పించి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. జూదరులను నియంత్రించకపోగా, అక్కడి పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల కనుసైగలను పరిగణలోకి తీసుకోని పనులు చేసిపెడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో జూదరులకు రాచమర్యాదలు తగ్గకుండా చూసుకున్నట్లు సమాచారం.