
కళ్లెదుటే వృథా
‘ప్రతీ నీటిబొట్టూ ఒడిసిపట్టు’ అంటూ విస్తృత ప్రచారం చేసే అధికారులు ప్రకృతి ప్రసాదించిన సాగర జలాలను పరిరక్షించుకోవడంలో విఫలమవుతున్నారు...
- కృష్ణసాగరం, అసర్ల సాగర జలాల పరిరక్షణ శూన్యం
- ఏళ్లు గడుస్తున్నా... తీరని మినీ రిజర్వాయర్ కల
పాతపట్నం : ‘ప్రతీ నీటిబొట్టూ ఒడిసిపట్టు’ అంటూ విస్తృత ప్రచారం చేసే అధికారులు ప్రకృతి ప్రసాదించిన సాగర జలాలను పరిరక్షించుకోవడంలో విఫలమవుతున్నారు. వేలాది ఎకరాలకు సరిపడా నీరు ఏటా వృథా అయిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. పాతపట్నం మండలంలోని బి.గోపాలపురం వద్ద కృష్ణ సాగరం, తెంబూరు వద్ద అసర్ల సాగరాల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వీటిని రిజర్వాయర్లుగా మారిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందుతుందన్న విషయం తెలిసినా అధికారులు ఎందుకో ఆ దిశలో ఆలోచించట్లేదు. మండలంలోని గంగువాడ, బడ్డుమర్రి ప్రాంతాలకే కాకుండా వందలాది ఎకరాలకు కృష్ణజలసాగరమే ఆధారం. పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజక వర్గాల్లో సుమారు 2600 ఎకరాలకు పైగా పంట భూములకు అసర్ల సాగరం నీరందిస్తోంది.
వర్షాలు పడితే ఈ సాగరాల్లోని నీరంతా వృథా అయిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని మినీ రిజర్వాయర్లుగా అభివృద్ధి పరిస్తే నీటిని ఆదా చేసుకోవచ్చని వారంటున్నారు. దీనిపై గతంలో అనేకసార్లు వినతి పత్రాలు అందించామని, ఓ సారి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందనీ పేర్కొన్నారు. బి.గోపాలపురం వద్ద ఉన్న కృష్ణ సాగరాన్ని మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి పరచాలన్న ప్రజల ఆకాంక్షను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక బృందం పరీశీలించింది. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపింది. అది ఏమైందో ఇప్పటికీ తెలీడం లేదు. రైతులు వర్షాకాలంలో వచ్చే వరదనీరు క్రిష్ణ సాగరంలోకి చేరుతున్నప్పటికి ఆ నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టడంతో వృథా అవుతోంది.
రిజర్వాయర్‌గా మారిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకునే వీలుంటుందని గంగువాడ ఎంపీటీసీ సభ్యుడు మిరియాబిల్లి బాబూరావు, తెంబూరు సర్పంచ్ బమ్మిడి సింహాచలం అభిప్రాయ పడ్డారు. అలాగే 750 ఎకరాల విస్తీర్ణం కలిగిన అసర్ల సాగరానికి ఇప్పటికే ఒకే స్లూయిజ్ ఉన్నప్పటికీ పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు 2600 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అయితే అసర్ల సాగరాన్ని రిజర్వాయర్‌గా స్థాయి పెంచితే మరింత ఆయకట్టుకు మేలు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.