
‘బెల్టు’ తీస్తున్నారు
బెల్టు దుకాణాల నిర్వహణ, ఎక్సైజ్ అధికారుల తీరుపై రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని ఇటీవల విమర్శలు
విజయనగరం రూరల్: బెల్టు దుకాణాల నిర్వహణ, ఎక్సైజ్ అధికారుల తీరుపై రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని ఇటీవల విమర్శలు గుప్పించడంతో ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలపై దాడులు ముమ్మురం చేశారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఐదో తేదీవరకు ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా 11 బెల్టు దుకాణాలపై కేసులు నమోదు చేయగా ఆరు, ఏడు తేదీల్లో 23 కేసులు నమోదు చేయడం విశేషం. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఏడు బృందాలతో రెండు రోజులుగా దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నేతల ఆనందరాజ్ తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నాయన్నారు.
ఈ నెల ఆరో తేదీన 12 బెల్టు దుకాణాలపై దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేశామని, ఏడో తేదీన 11 దుకాణాలపై దాడులు చేసి 11 మందిని అరెస్ట్ చేశామన్నారు. రెండు రోజుల్లో 298 మద్యం సీసాలను, తొమ్మిది బీరుబాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రెండు దుకాణాల్లో ఎంఆర్‌పీ ఉల్లంఘనలు కేసులు నమోదు చేశామన్నారు. ఈ నెల ఒకటి నుంచి ఇప్పటివరకు ఐడీ కేసులు తొమ్మిది, బెల్లం ఊట కేసులు 11, రెండు ఎంఆర్‌పీ కేసులు, 34 బెల్టు దుకాణాలపై కేసులు తానే స్వయంగా నమోదు చేశానని చెప్పారు. ఆయా కేసుల్లో ఇప్పటివరకు 38 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎంఆర్‌పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు సాగించినా, నాటుసారా తయారీ చేసినా, బెల్టు దుకాణాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.