పింఛన్ల్ల తొలగింపు తెచ్చిన తంటా
సంతకవిటి: పింఛన్ల తొలగింపు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీనికి జన్మభూమి గ్రామ సభ వేదికైంది. పింఛన్లు తొలగించడానికి కారకులైన వారి వివరాలు బహిర్గతం చేయాలని బాధితులు పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాల పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వివాదం సమసిపోయింది. వివరాల్లోకి వెళితే... మండలంలో మోదుగులపేటలో గురువారం వైస్ ఎంపీపీ కేసరి అధ్యక్షతన ఎంపీడీవో శ్రీనాధస్వామి, టీడీపీ నేత కొల్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. మోదుగులపేట, ముకుందపురం, చినముకుందపురం గ్రామాల ప్రజలు వచ్చి సమస్యలు ఏకరువుపెట్టారు.
అర్హత ఉన్నప్పటికీ 23 మంది పింఛన్లు తొలగించడానికి కారకులెవరో చెప్పాలంటూ బాధితులు అధికారులను డిమాండ్ చేశారు. దీంతో గ్రామానికి చెందిన ఎర్రన్నాయుడు కలుగుజేసుకుని మా పార్టీ వారి పింఛన్లు కూడా పోయాయని అనడంతో పలువురు బాధితులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అధికారులు సమాధానం చెప్పాలిగానీ నీ జోక్యమేమిటని ప్రశ్నించారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయులు మద్య ఘర్షణ చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. చివరకు టీడీపీ నేత కొల్ల అప్పలనాయుడుతో పాటు వైస్ ఎంపీపీ కేసరి, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు కనకల సన్యాశినాయుడు కలుగుజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ అర్హులందరికీ పింఛన్లు అందేలా చూసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అల్లినగరంలో అధికారుల నిలదీత
ఎచ్చెర్ల రూరల్: ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో గురువారం నిర్వహించిన గ్రామసభ రసాభాసయింది. పింఛన్లు తొలగించిన వారితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు అధికారులను నిలదీసి సభ సాగకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని గమనించిన ఎంపీపీ బి.వి.రమణారెడ్డి ఇక్కడ ఆగకుండా వెళ్లిపోయారు. తహశీల్దార్ బి.వెంకటరావు ఆధ్వర్యంలో సభ ప్రారంభమైన వెంటనే పింఛన్లు కోల్పోయిన వారంతా ఆందోళనకు దిగారు. అధికారులు 18 మంది పేర్లు తొలగించగా శ్యాం పిస్టన్స్ సంస్థలో పిల్లలు చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని మరో 39 మంది పింఛన్లు నిలిపివేశారు. ఈ విషయంపై వైసీపీ నాయుకుడు మాడుగుల మురళీధర్‌బాబా సర్పంచ్ అమ్మాజీ, ఎంపీటీసీ సభ్యురా లు మాడుగులు రూపవతి, శ్రీనివాసరావుతో పాటు అర్హత కలిగి పింఛన్‌పోయిన వారంతా అధికారులను నిలదీశారు. గంటన్నరసేపే ఈ అంశంపైనే వాదన జరిగింది. చివరకు రీసర్వే చేసి అరుహలకు పింఛన్లు పునరుద్ధరిస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. జేసీ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పి అక్కడనుండి వెళ్లిపోయారు. ఈ తంతు జరిగిన తరువాత జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎంపీపీ రమణారెడ్డి, తదితరులు వచ్చారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తుందని ధనలక్ష్మి చెప్పారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేశారు.
రుణమాఫీ లెక్క తేల్చండి
లింగాలవలస(టెక్కలి): రుణమాఫీ జన్మభూమి గ్రామసభలపై తీవ్ర ప్రభావం చూపించింది. టెక్కలి మండలం లింగాలవలసలో జరిగిన కార్యక్రమంలో మాఫీ లెక్క తేలి స్తేగానీ సభను సాగనీయమని పలువురు పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామంలో ఎంపీపీ మట్ట సుందరమ్మ అధ్యక్షతన గ్రామసభ ప్రారంభమైన వెంటనే రుణమాఫీ విషయాన్ని తేల్చాలంటూ మహిళలు అడ్డుతగిలారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఎంపీడీవో హరిహరరావు మాట్లాడుతుండగా మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు సమస్యలు ఏకరువు పెట్టారు. అదే సమయంలో ప్రత్యేకాహ్వానితుడు మట్ట పురుషోత్తం జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ప్రజల సమస్యలు ప్రస్తావిస్తుంటే నీజోక్యమేమిటని పురుషోత్తంను రాఘవరావు నిలదీశారు. విషయం తెలిసి ఎస్‌ఐ శంకరరావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
జన్మభూమి గ్రామసభలు రసాభాస
Published Fri, Oct 10 2014 2:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
Advertisement