రెవెన్యూ రికార్డులు
విజయనగరం గంటస్తంభం: రెవెన్యూ రికార్డుల్లో అనేక లోపాలున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. వాటిని సరిదిద్దేందుకు భూ(ల్యాండు) రికార్డులు స్వచ్ఛీకరణ(ఫ్యూరిఫికేషన్) చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో అన్ని గ్రామాల్లో రికార్డులు ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి రికార్డుల ప్యూరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి ఈ నెలాఖరు వరకు అన్ని గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుతో వెబ్‌ల్యాండు రికార్డు సరి చూశారు. డిసెంబర్ 1న తొలివిడత గ్రామాల్లో గ్రామసభ నిర్వహించారు. డిసెంబర్ 2 నుంచి 2020 జనవరి 31వ తేదీ వరకు తొలివిడత గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వినతిపత్రాలు తీసుకుని, వాటిని పరిష్కరించి రికార్డు సరి చేయాలి. రెండో విడత మార్చి నెలాఖరు నాటికి, మూడో విడత మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలి. కానీ మొదటి విడత గ్రామసభలు వరకు అంతా సక్రమంగా జరిగినా తర్వాత కార్యక్రమం కాస్తా మరుగున పడిందనే చెప్పాలి.
అప్‌డేట్ కాని రికార్డులు
రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా రెవెన్యూ రికార్డులు సరిదిద్దాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మాన్యువల్ రికార్డులతోపాటు వెబ్‌ల్యాండు రికార్డులు సరి చేయడంపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరు ప్రధాన సమస్యలపై దృష్టిసారించి రికార్డులు సరి చేయాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ కార్యక్రమం సత్ఫాలితాలిస్తుందన్న నమ్మకం కలగట్లేదు. మొత్తం సబ్ డివిజన్లలో ఉన్నతాధికారులు తయారు చేసిన ఫార్మాట్‌లో జిల్లాలో అధికారులు 18,46,406 అప్‌లోడ్ చేశారు. కానీ 9,75,078.34 ఎకరాలు మాత్రమే అప్‌లోడ్ చేశారు. మిగతా విస్తీర్ణం గురించి క్లారిటీ లేదు. అసలు ఇందులో మొదటి విడత గ్రామాల్లో ఎన్ని సబ్‌డివిజన్‌లు, విస్తీర్ణం ఉంది... అందులో ఎన్ని, ఎంత అప్‌లోడ్ చేశారన్నది తెలియడం లేదు. తహసీల్దార్లు భూమి రికార్డుల స్వచ్చీకరణ డేటా అప్‌లోడ్ కూడా చేయడం లేదు. అయినా రాష్ట్రంలో మనమే ముందంజలో ఉన్నామని అధికారులు చెబుతున్నారు.
అధికారుల మీన మేషాలు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూమి రికార్డులు స్వచ్చీకరణ కార్యక్రమం చేపట్టినా అధికారులు మాత్రం నిర్లిప్తంగానే ఉన్నారు. గ్రామాల్లో వీఆర్వోలు భూమి రికార్డులు స్వచ్చీకరణ గ్రామసభలు సక్రమంగా పెట్టలేదు. తొలివిడత గ్రామాల్లో రైతుల నుంచి ఎన్ని వినతులు వచ్చాయన్న విషయం చెప్పలేకపోతుండడం ఇందుకు నిదర్శనం. నవశకం సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీ, ఓటర్ల జాబితా సవరణ సాకుగా మొన్నటివరకూ చెప్పిన అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రెవెన్యూసంఘం నాయకుల ద్వారా రెవెన్యూ మంత్రిని కోరారు. ఎక్కువ సమయం ఇచ్చినందున వాయిదా కుదరదని మంత్రి చెప్పినా వీరి తీరు మారలేదు. నవశకం సర్వే పూర్తయినా, ఇళ్ల పట్టాలు పంపిణీ పనిభారం కొంత తగ్గినా రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మొత్తమ్మీద ఈ కార్యక్రమాన్ని ప్రహసనంగానే కొనసాగిస్తున్నారు. వీరి తీరువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
కార్యక్రమం కొనసాగుతోంది
భూమి రికార్డుల ఫ్యూరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తొలివిడత గ్రామసభలు జరిగాయి. అందులో గుర్తించిన సమస్యలు తహసీల్దార్లు పరిష్కరిస్తున్నారు. అయినా అందుకు సంబంధించి డేటా మాకైతే పంపడం లేదు. అందువల్లే స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఇకపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతాం.
– బాలాత్రిపుర సుందరి, ఎస్‌డీసీ, కేఆర్‌ఆర్‌సీ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment