ముగడ గ్రామం
ముగడ(బాడంగి)/విజయనగరం: ఆ గ్రామ తల్లులు తమ పిల్లలకు ఉగ్గిపాలతో పాటు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. దానినే ఊపిరిగా మారుస్తున్నారు. వీరులుగా తీర్చిదిద్దుతున్నారు. క్రమశిక్షణ అలవాటు చేస్తూ భరతమాత సేవకు సిద్ధం చేస్తున్నారు. యుక్తవయసు రాగానే సరిహద్దులో సేవలందించేందుకు పంపిస్తున్నారు. అందుకే.. ఆ ఊరే ఓ సైన్యంగా మారింది. ధైర్యసాహసాలతో శుత్రుదేశ సైనికుల్లో వణుకుపుట్టించే మిలటరీ వీరులకు పుట్టినిల్లుగా మారిన ముగడ గ్రామంపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్.
చదవండి: బాజాభజంత్రీలతో పెళ్లి బృందం.. ఒక్కసారిగా షాక్.. కాడెద్దులు పరుగో పరుగు..
ముగడ.. ఈ గ్రామం పేరుచెబితే ఠక్కున గుర్తొచ్చేది సైనికులే. గ్రామంలో సుమారు 983 కుటుంబాలు నివసిస్తుండగా.. 200 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, బీఎస్‌ఎఫ్ దళాల్లో పనిచేస్తున్నారు. నాలుగువేల మంది జనాభా ఉన్న గ్రామంలో రెండువేల మందివరకు విద్యావంతులు ఉన్నారు. గ్రామ యువత క్రమశిక్షణకు మారుపేరు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి గ్రామానికి చెందిన యువకులు సైన్యంలో సేవలందిస్తూ వస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సహం...
తల్లులు ధైర్యాన్ని నింపుతూ పిల్లలను పెంచుతుంటే... తండ్రులు దేశ సేవలో తరలించేలా ప్రోత్సహిస్తున్నారు. త్రివిధ దళాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే శారీరక దారుఢ్యం పెంచుకునేలా తర్ఫీదునిస్తున్నారు. రక్షణ దళాల్లో చేరేందుకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. చైతన్యం నింపుతున్నారు.
వివిధ కేడర్లలో గ్రామ యువత..
గ్రామానికి చెందిన దాదాపు 63 మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. మరికొందరు కల్నల్, లెఫ్ట్‌నెంట్ కల్నల్, సేబేదార్ వంటి కేడర్‌లలో పనిచేస్తున్నారు. స్వర్గీయ చప్ప సూర్యనారాయణ (వైద్యాధికారి)గా పనిచేయగా, స్వర్గీయ కోటస్వామినాయుడు, తెంటు స్వామినాయుడు కల్నల్‌గా సేవలందించారు. ప్రస్తుతం యమాల శ్రీనివాసరావు రాజస్థాన్ కోటిలో సుబేదార్‌గా పనిచేస్తుండగా, చొక్కాపు విజయ్‌కుమార్ అస్సాంలో కెఫ్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మత్సరాము మద్రాస్ ఇంజినీరింగ్ సర్వీస్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. వైమానికాదళంలో వివిధ క్యాడర్లలో పనిచేసి రిటైర్ అయినవారిలో మత్స మురళీధరరావు, మత్సరాము ఉన్నారు. మత్సరాము కొడుకు వైమానిక దళంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
విజ్ఞానం పంచే గ్రంథాలయం...
ముగడలో సైనికులు స్వయంగా ఓ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో దినపత్రికలతో పాటు గ్రామ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయమే ఉద్యోగాల సాధనకు బాసటగా నిలుస్తోంది. విజ్ఞానం పంచుతోంది.
ఊరిలోనూ సేవలు...
దేశానికే కాదు.. తమ గ్రామానికి సైనికులు సేవలందిస్తున్నారు. వివిధ పర్వదినాల్లో గ్రామానికి చేరకుని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. సొంత డబ్బులతో రోడ్లు బాగుచేస్తున్నారు. మొక్కులు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. అందుకే...గ్రామం ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుతారు. దేశభక్తిని ప్రదర్శిస్తారు.
ఆయనే స్ఫూర్తి..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మిలటరీలో చేరేందుకు యువకులు భయపడేవారు. అప్పట్లో గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు యామల స్వామినాయుడు మిలటరీలో చేరేలా యువతను ప్రోత్సహించారు. సొంత బావమరిది కోట స్వామినాయుడు మిలటరీలో చేరేలా శిక్షణ ఇచ్చారు. ఆయన కల్నల్ స్థాయికి ఎదిగి గ్రామ యువతకు మార్గదర్శకంగా నిలిచారు. సైన్యంలో చేరేలా యువతకు స్ఫూర్తిమంత్రం బోధించారు. అప్పటి నుంచి గ్రామ యువత దేశ సేవకు పునరంకితమవుతూనే ఉంది.
గర్వంగా ఉంది
ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది. వివిధ క్యాడర్లలో పనిచేశాను. ప్రస్తుతం రాజస్తాన్‌లోని కోటలో సుబేదార్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా.. చదువులో ప్రోత్సహించారు. వారిచ్చిన నైతిక మద్దతుతోనే సైన్యంలో చేరాను.
– యామల శ్రీనివాసరావు, ముగడ
వైమానిక దళంలో పనిచేయడం నా అదృష్టం
దేశరక్షణలో భాగంగా త్రివిధ దళాల్లో ఒకటైన వైమానికదళంలో ఫిట్టర్‌గా, వర్క్‌డ్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాను. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదివిన వెంటనే ఎయిర్‌ఫోర్స్‌కు సెలక్టయ్యాను. నా తండ్రి మత్ససూర్యనారాయణ మద్రాస్‌లో డాక్టర్ కోర్స్ చదివారు. ఆయన ప్రోత్సాహంతోనే వైమానిక దళంలో చేరాను. దేశానికి సేవచేసే భాగ్యం కలగడం నా అదృష్టం.
– మత్స మురళీధరరావు, విశ్రాంత ఎయిఫోర్స్ అధికారి, ముగడ
Comments
Please login to add a commentAdd a comment