Officials Neglected
-
అలాగే వదిలేస్తారా...
విజయనగరం గంటస్తంభం: రెవెన్యూ రికార్డుల్లో అనేక లోపాలున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. వాటిని సరిదిద్దేందుకు భూ(ల్యాండు) రికార్డులు స్వచ్ఛీకరణ(ఫ్యూరిఫికేషన్) చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో అన్ని గ్రామాల్లో రికార్డులు ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి రికార్డుల ప్యూరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి ఈ నెలాఖరు వరకు అన్ని గ్రామాల్లో ఆర్ఎస్ఆర్ రికార్డుతో వెబ్‌ల్యాండు రికార్డు సరి చూశారు. డిసెంబర్ 1న తొలివిడత గ్రామాల్లో గ్రామసభ నిర్వహించారు. డిసెంబర్ 2 నుంచి 2020 జనవరి 31వ తేదీ వరకు తొలివిడత గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వినతిపత్రాలు తీసుకుని, వాటిని పరిష్కరించి రికార్డు సరి చేయాలి. రెండో విడత మార్చి నెలాఖరు నాటికి, మూడో విడత మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలి. కానీ మొదటి విడత గ్రామసభలు వరకు అంతా సక్రమంగా జరిగినా తర్వాత కార్యక్రమం కాస్తా మరుగున పడిందనే చెప్పాలి. అప్డేట్ కాని రికార్డులు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా రెవెన్యూ రికార్డులు సరిదిద్దాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మాన్యువల్ రికార్డులతోపాటు వెబ్‌ల్యాండు రికార్డులు సరి చేయడంపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరు ప్రధాన సమస్యలపై దృష్టిసారించి రికార్డులు సరి చేయాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ కార్యక్రమం సత్ఫాలితాలిస్తుందన్న నమ్మకం కలగట్లేదు. మొత్తం సబ్ డివిజన్లలో ఉన్నతాధికారులు తయారు చేసిన ఫార్మాట్లో జిల్లాలో అధికారులు 18,46,406 అప్లోడ్ చేశారు. కానీ 9,75,078.34 ఎకరాలు మాత్రమే అప్లోడ్ చేశారు. మిగతా విస్తీర్ణం గురించి క్లారిటీ లేదు. అసలు ఇందులో మొదటి విడత గ్రామాల్లో ఎన్ని సబ్డివిజన్లు, విస్తీర్ణం ఉంది... అందులో ఎన్ని, ఎంత అప్లోడ్ చేశారన్నది తెలియడం లేదు. తహసీల్దార్లు భూమి రికార్డుల స్వచ్చీకరణ డేటా అప్లోడ్ కూడా చేయడం లేదు. అయినా రాష్ట్రంలో మనమే ముందంజలో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. అధికారుల మీన మేషాలు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూమి రికార్డులు స్వచ్చీకరణ కార్యక్రమం చేపట్టినా అధికారులు మాత్రం నిర్లిప్తంగానే ఉన్నారు. గ్రామాల్లో వీఆర్వోలు భూమి రికార్డులు స్వచ్చీకరణ గ్రామసభలు సక్రమంగా పెట్టలేదు. తొలివిడత గ్రామాల్లో రైతుల నుంచి ఎన్ని వినతులు వచ్చాయన్న విషయం చెప్పలేకపోతుండడం ఇందుకు నిదర్శనం. నవశకం సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీ, ఓటర్ల జాబితా సవరణ సాకుగా మొన్నటివరకూ చెప్పిన అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రెవెన్యూసంఘం నాయకుల ద్వారా రెవెన్యూ మంత్రిని కోరారు. ఎక్కువ సమయం ఇచ్చినందున వాయిదా కుదరదని మంత్రి చెప్పినా వీరి తీరు మారలేదు. నవశకం సర్వే పూర్తయినా, ఇళ్ల పట్టాలు పంపిణీ పనిభారం కొంత తగ్గినా రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మొత్తమ్మీద ఈ కార్యక్రమాన్ని ప్రహసనంగానే కొనసాగిస్తున్నారు. వీరి తీరువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కార్యక్రమం కొనసాగుతోంది భూమి రికార్డుల ఫ్యూరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తొలివిడత గ్రామసభలు జరిగాయి. అందులో గుర్తించిన సమస్యలు తహసీల్దార్లు పరిష్కరిస్తున్నారు. అయినా అందుకు సంబంధించి డేటా మాకైతే పంపడం లేదు. అందువల్లే స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఇకపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతాం. – బాలాత్రిపుర సుందరి, ఎస్డీసీ, కేఆర్ఆర్సీ, విజయనగరం -
భోజనం మాది.. నీళ్లు మీవి!
♦ జిల్లాలోని అనేక పాఠశాలల్లో నీటి వసతి కరువు ♦ అతిథి గృహాల్లోనూ అవే ఇబ్బందులు ♦ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు ♦ అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం కార్పొరేట్ స్థాయి విద్య.. సకల సౌకర్యాలు.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్పించండి... ఇదీ ప్రతిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలు. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని అనేక ప్రభుత్వ విద్యాలయాల్లో కనీసం తాగునీరు కూడా అందని దుస్థితి. ఇక టాయిలెట్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో బడుల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు అనాసక్తి చూపుతున్నారు. రాయికోడ్ : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు తెచ్చుకునే బాటిళ్లలో నీళ్లు అయిపోతే.. ఇక వారు పడే బాధ చెప్పలేనిది. మండల కేంద్రం రాయికోడ్‌లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు శంశోద్ధీన్పూర్, ఇటికేపల్లి ప్రాథమికోన్నత, అల్లాపూర్ ప్రాథమిక, మహబత్‌పూర్, పాంపాడ్, దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు దాహంతో అలమటిస్తున్నారు. పలు పాఠశాలల్లో బోర్లు ఉన్నా పనిచేయడం లేదు. మరికొన్ని మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందిస్తామన్న అధికారుల మాటలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా కనీస సౌకర్యాలు సమకూరకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు. మండలంలో 25 ప్రాథమిక, 17 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సగం పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. రెండేళ్లుగా ఇంటి నుంచే నీళ్లు రెండు సంవత్సరాలుగా ఇంటి నుంచే బాటిల్‌తో నీళ్లు తెచ్చుకుంటున్నా. మధ్యాహ్న భోజనంలో వీటినే ఉపయోగిస్తున్నా. పాఠశాలలో నల్లా ఉన్నా నీళ్లు రావడం లేదు. -సోని, 4వ తరగతి, రాయికోడ్ ప్రాథమిక పాఠశాల. ఇబ్బందిగా ఉంది పాఠశాలలో నీళ్లు రావడం లేదు. బాటిళ్లలో తెచ్చుకున్న నీళ్లు అయిపోతే హోటళ్లు, బావుల వద్దకు వెళ్తున్నాం. ప్రతిరోజు నల్లాల ద్వారా నీళ్లు అందించాలి. - అర్జున్, 4వ తరగతి, రాయికోడ్ ప్రాథమిక పాఠశాల ఉన్నతాధికారులకు చెప్పాం మండలంలోని కొన్ని పాఠశాలల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. నీటి సౌకర్యం లేని పాఠశాలల వివరాలు, విద్యార్థుల ఇబ్బందులపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. - నగారి శ్రీనివాస్, ఎంఈఓ రాయికోడ్. -
- పాఠశాలల యూనిఫామ్‌కు చెదలు
నెల్లూరు(టౌన్): అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌కు చెదలు పట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లను అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 1.95 లక్షల మందికి యూనిఫామ్ అందించాలి. రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిధులను సక్రమంగా వినియోగించి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్ అందించాలి. అయితే అధికారుల నిర్లక్ష్యంవల్ల యూనిఫామ్స్ సకాలంలో విద్యార్థులకు చేరడం లేదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. వీటికి బలం చేకూర్చేలా మూలాపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలోని స్టాక్ పాయింట్లో నిల్వ ఉంచిన యూనిఫామ్స్ చెదలు పట్టాయి. నెల్లూరు మండలానికి చెందిన పాఠశాలలకు పంపాల్సిన యూనిఫామ్ అక్కడ నిల్వ ఉంది. గత సంవత్సరం ఎలా పంచారో.. ఏమో గాని పెద్ద సంఖ్యలో ఉన్న యూనిఫామ్‌లు దుమ్ము పట్టి పనికి రాకుండా పోతున్నాయి. అంతే కాక అడుగు భాగాన ఉన్న యూనిఫామ్‌కు చెదలు కూడా పట్టింది. యూనిఫామ్స్ పనికి రాకుండా పోతున్నాయంటూ ఏబీవీపీ జిల్లా నాయకులు బుధవారం స్టాక్ పాయింట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీవీపీ నేత ఈశ్వర్ మాట్లాడుతూ కలెక్టర్ జోక్యం చేసుకుని సకాలంలో యూనిఫామ్ విద్యార్థులకు చేరేలా చూడాలన్నారు. ఈ విషయమై ఎంఈవో రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా గత సంవత్సరం 500 మంది విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ మిగిలిందన్నారు. ఈ యూనిఫామ్‌ను నాలుగురోజుల్లో అందరికీ పంచుతామని తెలిపారు. ఒక సారి ఉతికితే పై దుమ్ము పోతుందన్నారు.