జహీరాబాద్, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన వర్షాలు రైతన్నను నిండా ముంచితే, పరిహారమిచ్చి ఆదుకోవాల్సిన సర్కారు మెలికలు పెడుతూ తప్పించుకునేందుకు సిద్ధమైంది. పంటనష్టంపై సర్వే చేపట్టిన అధికారులు పొలం పచ్చగా ఉంటే పైసలిప్పించలేమని తేల్చిచెబుతున్నారు. అంతేకాదు 50 శాతం పంటకు నష్టం వాటిల్లితేనే పరిహారం ఇవ్వాలని సర్కారుకు నివేదిక పంపుతున్నారు. దీంతో రైతన్నలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నిండా మునిగిపోయాం..ఆదుకోండంటూ అధికారుల కాళ్లుకు మొక్కుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో రెవెన్యూ, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖల అధికారులు పంట నష్టం సర్వే పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది, అల్లం, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పసుపు, చెరకు, వరి తదితర పంటలకు సంబంధించి నష్టం ఏ మేరకు జరిగిందనే అంశంపై సర్వే నిర్వహిస్తున్నారు. పంట నష్టం అధికంగా ఉంటేనే నష్టం కిందకు తీసుకుంటుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్షాలకు పైరు ఎగదకుండా పచ్చగా దర్శనమిస్తే సర్వేకు నిరాకరిస్తుండడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పత్తిరైతుకు పరిహారం లేదట..!
జహీరాబాద్ ప్రాంతంలో భారీ విస్తీర్ణంలో పత్తి పంట సాగులో ఉంది. పంట ఆశాజనకంగా పండితే ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చేవి. అయితే ఎడతెరిపిలేని వర్షాలతో పత్తి పంటకు తగినంత కాత లేక పోవడంతో 4 నుంచి 6 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే పరిస్థితి లేదు. సర్కార్ పరిహారమివ్వకపోతే పత్తి ఏరేందుకు అయ్యే కూలీలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూడా గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో పెట్టాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి పంట పచ్చగా కనిపిస్తుండడంతో పంట నష్టం కిందకు అధికారులు చేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలతో 10 శాతం మందికి కూడా పంట నష్టం లభించే పరిస్థితి లేదని రైతాంగం ఆందోళన చెందుతోంది.
మొక్కజొన్న, ఆలుగడ్డ, అల్లం రైతులకు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. 40 శాతం అల్లం పంట దెబ్బతిన్నా, నష్టం కిందకు చేర్చక పోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎకరా అల్లం పంట సాగు కోసం సుమారు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వారు చెబుతున్నారు. పంట దెబ్బతినడంతో దిగుబడులు కూడా పూర్తిగా పడిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో కొంత మేర అల్లం పంటకు నష్టం వాటిల్లినా పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్న రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. విత్తనం భూమిలోనే కుళ్లి పోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కంది పంట వర్షాలకు ఎర్రబారినా నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించడం లేదు. 10 శాతం నష్టం వాటిల్లినా పరిహారం కిందకు చేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చెల్లించిన విధంగానే ఈ సంవత్సరం కూడా పంట నష్ట పరిహారం చెల్లించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు.
పచ్చగా ఉంటే పైసలివ్వం
Published Thu, Nov 7 2013 12:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement