
కర్ఫ్యూ నేపథ్యంలో బోసిపోయిన విజయవాడ గజపతిరావు ప్రధాన రహదారి
సాక్షి, అమరావతి : ప్యారిస్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ యువకుడికి శనివారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 1,005 మంది వివరాలతో కూడిన జాబితా జిల్లాకు చేరింది. వీరంతా ఎక్కడ ఉన్నారో ఆరా తీయడంలో యంత్రాంగం నిమగ్నమైంది. ఆయా మండలాల అధికారులను అప్రమత్తం చేసి వీరిని స్వీయ నిర్బంధంలో ఉంచేలా చర్యలకు సిద్ధమయ్యారు. అలాగే జిల్లాలో మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో, గన్నవరం వెటర్నరీ కళాశాలలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ కేంద్రాల్లో కల్పించాల్సిన సదుపాలయ కోసం ఫ్లోరింగ్, ఇంటీరియర్ పనులు నిర్వహిస్తున్నారు.
నగరంలో మరింత అప్రమత్తం..
మూడు రోజుల కిందట ప్యారిస్ నుంచి బాధితుడు నగరానికి వచ్చాడు. ఆ యువకుడు ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జర్వం రావడంతో అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆ సమయంలో వైద్యులు అతన్ని పరీక్షించి రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించారు. 21న అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఉండే ప్రాంతంలో 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్లలో గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో కూడిన 50 బృందాలతో సర్వే చేశారు. అలాగే బాధితుడు ఢిల్లీ నుంచి వచ్చిన మార్గం.. రవాణా సదుపాయాలను గుర్తించే చర్యలు చేపట్టారు. బాధితుడు హైదరాబాద్ నుంచి క్యాబ్‌లో విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతన్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ ఎవరు? విజయవాడకు వచ్చాక బాధితుడు ఈ మూడు రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరిని కలిశాడు? అని ఆరా తీస్తున్నారు. అలాగే అతని కుటుంబసభ్యులు ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు.
ఇంటింటా సర్వే..
జిల్లాలో గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటారు. దీంతోపాటు కుటుంబ సభ్యులకు కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి జిల్లాకు 1005 మంది వచ్చినట్లు అధికారికంగా తెలుస్తోంది. వీరందరిని పారామెడికల్ సిబ్బంది పర్యవేక్షిస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వని వారు సైతం వెంటనే తమ వివరాల్ని నమోదు చేయాలని కోరుతున్నారు.
నగర రహదారులన్నీ నిర్మానుష్యం..
రోజురోజుకీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెజవాడ నగర కర్ఫ్యూలో భాగమైంది. దీంతో ఎప్పుడూ జనసమూహంతో ఉండే పలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా బస్సులన్ని డిపోలకే పరిమితమవడంతో జాతీయ రహదారులు బోసిపోయాయి. ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇళ్లకు పరిమితమయ్యారు.
ప్రజలంతా సహకరించాలి: కలెక్టర్ ఇంతియాజ్
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమవంతు సామాజిక బాధ్యతలను చాటాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని, ప్రయాణాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని కోరారు.
ఏప్రిల్ 14వరకు 144 సెక్షన్ : నగర సీపీ ద్వారకాతిరుమలరావు
విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రేపటి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘కరోనా సోకిన యువకుడికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారని చెబుతున్నా వారికీ పరీక్షలు అవసరం. వారి కుటుంబ సభ్యులు బయటికి వస్తే వైరస్ విస్తరించే అవకాశం ఎక్కువ. విజయవాడలో కరోనా కంట్రోల్ రూమ్ నెంబర్ 7995244260కు ఫోన్ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చు’ అని నగర సీపీ తెలిపారు.