మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి : వృద్ధాప్య పింఛన్లు కొత్తగా మంజూరుకావడంతో పండుటాకులు ఎంతో సంతోషించారు.. అధికారుల ఓదార్పు, ప్రజాప్రతినిధుల బాసలు చూసి గంతేశారు.. ఇక పూటకష్టం తీరిందని సంబరపడ్డారు. ఆదిలోనే వృద్ధులు, వికలాంగుల ఆశలపై నీళ్లు చల్లుతూ కొత్తగా మంజూరైన 44 పింఛన్లను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాలకులవి ఉత్తి‘కోత’లేనని తేలిపోయింది. ప్రభుత్వం గతంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులైన దాదాపు 44 వేల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేసి హడావుడిగా పంపిణీకూడా చేశారు.
అయితే కొత్తగా మంజూరైన పింఛన్లను నిలిపేయడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,12, 271 మందికి ప్రభుత్వం ప్రతినెలా వివిధ రకాల పింఛన్లను మంజూరుచేస్తోంది. విచారణ సాకుతో వివిధ కారణాలు చూపుతూ వీటిలో దాదాపు 97వేల పింఛన్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్తగా 44వేల పింఛన్లను మంజూరుచేసిన విషయం తెలిసిందే. 2454 మంది వికలాంగులు, 25,466 మంది వృద్ధులు, 13,491 వితంతువులతో పాటు చేనేత, కల్లుగీత కార్మికులకు అరకొరగా కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. వీరికి ఒకనెల పంపిణీ చేయడంతో ఇక ప్రతినెలా పింఛన్ అందుతుందని సంతోషపడ్డారు. అయితే పింఛన్ల పంపిణీకి కూడా రాజకీయాన్ని ముడిపెట్టడంతో ప్రస్తుతం వాటిని నిలుపుదల చేశారు.
ఆందోళనబాటలో లబ్ధిదారులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మరోమారు రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. రచ్చబండ పేరుతో ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ, సమైక్యాంధ్ర అనే నినాదాలతో ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉందని వాటి నుంచి బయటపడేందుకు రచ్చబండలో పింఛన్లు పంపిణీచేసి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన డబ్బులు ప్రస్తుతం పంపిణీ చేయొద్దని జిల్లా అధికారులకు తాజాగా ఉత్తర్వులు రావడంతో నిలిపేశారు. దీంతో తమ పింఛన్లను ఎందుకు రద్దుచేశారో చెప్పాలని వృద్ధులు ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కుతున్నా అధికారుల నుంచి సమాధానం కరువైంది. ఇలా ప్రతిరోజు ఎదో ఒకచోట ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలాఉండగా కొత్తగా కొలువుదీరిన సర్పంచ్‌ల వద్దకు వెళ్లి ఎలాగైనా పింఛన్ డబ్బులు ఇప్పించాలంటూ వారిపై ఒత్తిడి తెస్తుండటంతో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల మహబూబ్‌నగర్ మండలం క్రిష్టియన్‌పల్లి గ్రామంలో పింఛన్ల కోసం ఆందోళనచేయగా ఆఖరుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. పింఛన్లను ఎందుకు రద్దుచేశారో చెప్పాలంటూ మంగళవారం నిర్వహించిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలో మక్తల్ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పింఛన్లు పంపిణీ చేయకుండా నిలుపుదల చేశామని సమాధానమిచ్చారు.
ఉత్తి ‘కోత’లే !
Published Wed, Sep 11 2013 5:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
Advertisement