
'సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు'
హైదరాబాద్ : అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం బంగారపు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పసిడి కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం నగల దుకాణాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి. గోల్డ్ షాపులు ఉదయం నుంచే తెరిచి ఉంచారు. అక్షయ తృతీయ నాడు ఏవైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఆ లక్ష్మిదేవి సిరి,సంపదలు, సౌభాగ్యం, పొందుతారని ప్రజల నమ్మకం. ఇక అక్షయ సెంటిమెంటుకు తోడు పుత్తడి ధర తక్కువగా ఉండటంతో బంగారం కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు అక్షయ తృతీయ పేరుతో ఆభరణాల వర్తకులు సెంటిమెంట్ను క్యాష్ చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఆభరణాలపై అడ్వాన్స్ బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించాయి. అలాగే పోటీపడి మరీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కొంటే రెండు గ్రాముల వెండి నాణాలు ఉచితం ఉంటూ ఊదరగొడుతున్నారు.
ఇక అక్షయ తృతీయ నాడు బంగారం కొని దాచుకోవాలన్న తొందరలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కాకి బంగారం అంటగట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. సెంటిమెంట్ను గౌరవించాల్సిందే కానీ గుడ్డిగా ముందుకెళ్లడం మంచిది కాదు. ఏదైనా తేడా ఉంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి. సరైన బిల్లుతో ఆశ్రయించడం ద్వారా మోసాలు నుంచి రక్షణ పొందవచ్చు.