నల్లమల నుంచి నగరానికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు
భూతం అన్నపూర్ణ అరెస్ట్‌తో పోలీసులు అప్రమత్తం
నగరంలో సానుభూతిపరుల కదలికలపై ఆరా
విజయవాడ : మావోయిస్టు షెల్టర్ జోన్‌గా ఉన్న బెజవాడ నగరంపై పోలీసులు నిఘా ఉంచారు. నగరంలోకి కొత్తగా ఎవరెవరు వస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, సానుభూతిపరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది లాంటి అంశాలపై నగర కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్ దళ డెప్యూటీ కమాండర్ భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, సృజనను గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను నూతన రాజధాని కోర్ క్యాపిటల్ ప్రాంతమైన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మంగళవారం అదుపులోకి తీసుకొని బుధవారం అరెస్టు చూపిన ఘటన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలకలం రేపింది. దీంతో మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై రెండు జిల్లాల్లో పోలీస్ నిఘా పెరిగింది.
మళ్లీ కలకలం...
విజయవాడ నగరం ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంది. నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, కృష్ణలంక, భవానీపురం తదితర ప్రాంతాల్లో, నగర శివారు గ్రామాల్లో కొందరు ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులు నగరంలో తలదాచుకోవటంతో పాటు వైద్య సేవల కోసం ఎక్కువగా వస్తుంటారు. కృష్ణా జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం లేకపోవటంతో మొదటి నుంచి ఎక్కడా మావోయిస్టు కార్యకలాపాలు లేవు. జిల్లాలో, నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు తప్ప ఒకస్థాయి మావోయిస్టు నాయకులు ఎవరూ లేరు. ఈ క్రమంలో 2004కు ముందు విజయవాడలో వెంకటేశ్వర్లు అనే మావోయిస్టు లొంగిపోవటం మినహా ఇతర ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా రాజధాని ప్రాంతంలో మావోయిస్టు నేత సంచరించటం కలకలం రేపింది. ముఖ్యంగా ఇక్కడి గుంటూరు, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, ఇసుక మాఫియా ఆగడాలపై మావోయిస్టు పార్టీ స్పందించి కొందరు నేతలకు అల్టిమేటం ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ దీనిపై దృష్టిసారించారు.
పోలీసులకు సవాలే...
రాష్ట్ర విభజనతో విజయవాడ రాజధాని నగరంగా మారింది. నగరంలో సీఎం సహా అనేకమంది వీవీఐపీల కార్యక్రమాలు నిత్యంగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మావోయిస్టు కార్యకలాపాలు నగరంలో మొదలైతే పోలీసులకు భద్రతాపరంగా సవాలుగా మారే అవకాశం ఉంది. దీంతో అన్నపూర్ణ అరెస్ట్ ఘటనతో మరింత అప్రమత్తం అయ్యారు. నల్లమలతో పాటు రాష్ట్రంలోనే మావోయిస్టుల కీలక షెల్టర్ జోన్‌గా ఉన్న విజయవాడపై పోలీస్ నిఘా పెంచారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ముఖ్యంగా సానుభూతిపరులు, వారికి మద్దతు పలికే ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలపై నిఘా ఉంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, జనసమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెరిగింది.