సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఓటర్ల నమోదు తుది జాబితా విడుదలపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం కొత్తగా 2,20,908 మందిని ఓటర్లుగా చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2,12,296 మంది గడువు నాటికి ఓటుహక్కు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 8,612 ఓట్లు నమోదు కాలేదు. డిసెంబర్ 23 నాటికి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2,12,296 దరఖాస్తులు ఓటుహక్కు కోసం స్వీకరించిన అధికారులు ఆ మరుసటి నుంచి డాటా ఎంట్రీ మొదలెట్టారు. ఈ నెల 15 వరకు ఓటర్ల నమోదు కసరత్తు పూర్తి చేసి... 16న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. అయితే ఇచ్చిన ఓటు నమోదు అవకాశాన్ని ఎవరైనా అందుకోలేకపోయినా.. అవకాశం ఇస్తే నమోదు చేసుకోవాలని ఉన్నా.. గురువారం నుంచి కచ్చితంగా తొమ్మిది రోజులు ఆగితే అర్హులైన వారందరూ నమోదు చేసుకోవచ్చు. కాగా కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు త్వరలోనే గుర్తింపు పత్రాలు అధికారులు జారీ చేయనున్నారు.
17 నుంచి మళ్లీ ఓటర్ల నమోదు
17 నుంచి ఓటు నమోదుకు ఎన్నికల కమిషన్ మళ్లీ అవకాశం కల్పించనుంది. గత డిసెంబర్ 23 వరకు నమోదు చేసుకోని వారికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా పక్కా ఓటరు జాబితాను తయారు చేయాలని ఎన్నికల కమిషన్ కృతనిశ్చయంతో ఉంది. ఆ మేరకు జిల్లా అధికారులకు తరచూ ఆదేశాలు ఇస్తూనే ఉంది. ఇదిలా వుంటే తుది జాబితా ఈ నెల 16న ప్రకటిస్తే మరుసటి రోజు నుంచి ఓటుహక్కును నమోదు చేసుకోని వారు సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు 10 రోజుల ముందు వరకు నమోదు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాబితాలో పేరు వచ్చేలా చేస్తారు. వారందరూ రానున్న ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
ఓటర్ల తుది జాబితాపై అధికారుల కసరత్తు
డిసెంబర్ 23 వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు క్రోడీకరించి తుది జాబితాను ప్రకటించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారవర్గాలు కుస్తీ పడుతున్నారు. ఇంటర్‌నెట్ ఆన్‌లై న్ ద్వారా వచ్చిన దరఖాస్తులు ఎన్ని అనేది తెలుసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలు తెలుసుకునే క్రమంలో సర్వర్ పడిపోయి పదే పదే సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నా.. అధికారులు జాబితాల తయారీలో బిజీగా ఉన్నారు. కాగా అధికారులకు అందిన దరఖాస్తులను పరిశీలిస్తే లక్ష్యం ఎక్కువగా పెట్టుకున్న నియోజకవర్గాల్లో నమోదు తగ్గగా, తక్కువ లక్ష్యం ఉన్నచోట పెరిగాయి. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటుహక్కు నమోదు లక్ష్యం, వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల సంఘం ఇచ్చిన లక్ష్యం : 1,94,498
వివిధ కారణాలతో తొలగించబడే ఓట్లు : 26,410
జిల్లాలో ఓటర్ల నమోదుకు లక్ష్యం : 2,20,908
నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు : 2,12,296
లక్ష్యానికి దూరమైన ఓటర్ల సంఖ్య : 8,612
ఓటర్ల నమోదుకు మరో అవకాశం : ఈ నెల 17 నుంచి
నియోజకవర్గం- లక్ష్యం- వచ్చినవి
ఆదిలాబాద్-14,325- 21,974
బోథ్ -32,162- 23,292
నిర్మల్- 19,699- 18,914
ముథోల్ -36,225- 26,571
ఖానాపూర్-31,004- 22,746
మంచిర్యాల-7,440 -23,657
బెల్లంపల్లి-4,979 -12,325
సిర్పూరు-22,680- 18,500
ఆసిఫాబాద్-41,982 -29,260
చెన్నూరు-10,412 -15,057
మొత్తం-2,20,908- 2,12,296
తుది జాబితా కోసం కసరత్తు
Published Thu, Jan 9 2014 3:02 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement