సాక్షి, ఆదిలాబాద్: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ పట్టణ ఓటర్ల సంఖ్య తేలింది. మున్సిపల్ ఎన్నికల్లో మరో కీలక ఘట్టమైన ఓటరు జాబితా సవరణ ముగిసింది. గతనెల 30న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులను సరిచేసేందుకు ఈనెల 2 వరకు అవకాశం కల్పించారు. 3న అభ్యంతరాలను పరిశీలించి శనివారం ఓటర్ల తుది మొదటి పేజీ తరువాయి జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా ప్రకారం మున్సిపల్ పరిధిలో 1,27,801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 63,057, మహిళలు 64,738 మంది ఉన్నారు.
కులాల వారీగా ఓటర్లు ఇలా.. 30న విడుదలైన ముసాయిదా జాబితా ప్రకా రం ఏవైనా తప్పులుంటే సరిచూసుకునే అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం తప్పుల సవరణ అనంతరం కూడా అదే ఓటర్లు ఉన్నారు. వార్డుల విభజనలో భాగంగా ఒక వార్డులోని కొంత భాగాన్ని వేరేవార్డులో కలిపినా ఓటర్ల సంఖ్య మాత్రం సరిగ్గానే ఉంది. నూతన లెక్కల ప్రకారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్టీ ఓటర్లు 5,380 మంది ఉండగా పురుషులు 2,629, మహిళలు 2,751 ఉన్నారు.
ఎస్సీ కేటగిరిలో మొత్తం 16,833 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8,144, మహిళలు 8,689 మంది ఉన్నారు. బీసీ కేటగిరిలో మొత్తం 72,095 మంది ఓటర్లు ఉండగా పురుషులు 35,617, మహిళలు 36,476 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 33,493 మంది ఉండగా పురుషులు 16,667, మహిళలు 16,822 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని కేటగిరీలకు చెందిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment