
అవినీతి సీఐపై వేటు
నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ
రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న ‘ఏసీబీ’
విశాఖపట్నం: అక్రమాస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డ మెరైన్ సీఐ షేక్ హుస్సేన్‌ను సస్పెండ్ చేస్తూ విశాఖ రేంజ్ డిఐజీ ఎ.రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న అవినీతి శాఖ అధికారులు హుస్సేన్ ఆస్తులపై ఏకకాలంలో 12 చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి కోట్లాది రూపాయల ఆస్తులను బంధువులు, స్నేహితులు, బినామీల పేరుపై కూడబెట్టిన విషయం ఈ దాడుల్లో వెలుగు చూసింది. ఈ కేసులో అరెస్టయిన హుస్సేన్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా కోర్టులో అప్పీలు చేసుకున్నారు. దానిపై గురువారం విచారణ జరగనుంది.
బెయిల్‌ను అడ్డుకోవాలనుకుంటున్న ఏసీబీ
కేసు తీవ్రత దృష్ట్యా హుస్సేన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవాలని ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాని కోసం పక్కా అధారాలతో పకడ్బందీగా కేసు షీట్ తయారు చేస్తున్నారు. మరోవైపు హుస్సేన్ బాధితులు ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అతని చేతిలో మోసపోయిన వారు, దౌర్జన్యానికి గురైన వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
వారు చెబుతున్న అంశాల్లో అక్రమ ఆదాయానికి సంబంధించిన విషయాలను ఏసీబీ నమోదు చేసుకుంటోంది. ముందుగా ఇప్పటి వరకూ లభించిన ఆధారాలు, అక్రమాస్తుల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా క్రోడీకరించే పనిలో ఉన్నారు. వాటిని నేడు కోర్టుకు సమర్పించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ ‘సాక్షి’కి బుధవారం తెలిపారు.
లంచాల ‘దొర’కు రిమాండ్
పాత సీసాల వ్యాపారి నుంచి రూ.18వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కిన పెందుర్తి నేర విభాగం హెడ్ కానిస్టేబుల్ ఎ.అప్పలస్వామిదొరను బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.