వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
పశ్చిమ గోదావరి : వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు సమీపంలో మంగళవారం జరిగింది. ఉంగుటూరు మండలం నాచుకుంట గ్రామానికి చెందిన వర్జి రవి(32) ద్విచక్రవాహనంపై తన కుటుంబ సభ్యులతో ముదునూరు నుంచి నాచుకుంట వెళ్తున్న క్రమంలో రహదారిపై ఉన్న కాంటా వేబ్రిడ్జి వద్ద టర్న్ అవుతున్న లారీని బైక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.