ఒకే గుండెతో.. అవిభక్త కవలల జననం
విశాఖపట్నం ప్రభుత్వ ఘోషా ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం అరుదైన అవిభక్త కవలలు జన్మించారు. మగ శిశువులిద్దరూ ఛాతీ వద్ద అతుక్కుని పుట్టారు. ఇద్దరికీ ఒకే గుండె, ఒకే కాలేయం ఉన్నాయి. చికిత్స నిమిత్తం వీరిని కేజీహెచ్‌కు పంపించారు. శిశువుల తండ్రి మారపల్లి యర్రయ్య భవన నిర్మాణ సెంటరింగ్ కార్మికుడు. తల్లి నూకాలమ్మ గృహిణి.
ఆమెకిది మూడో కాన్పు. తొలి రెండు కాన్పులు కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అండ విభజన సరిగా జరిగితే కవలలు జన్మిస్తారని.. సరిగ్గా జరగకపోతే ఇలా అవిభక్త కవలలు పుడతారని ఘోషా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమ చెప్పారు. కొందరు తల వద్ద, మరొకొందరు చాతీవద్ద, ఇంకొందరు నడుము వద్ద అతుక్కుని పుడతారన్నారు. శిశువులిద్దరినీ కేజీహెచ్‌కు పంపించి చికిత్స చేయిస్తామన్నారు.