ఒక దేశం.. ఒక గ్రిడ్.. | One nation.. one grid | Sakshi
Sakshi News home page

ఒక దేశం.. ఒక గ్రిడ్..

Published Thu, Jan 2 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

ఒక దేశం.. ఒక గ్రిడ్..

ఒక దేశం.. ఒక గ్రిడ్..

‘న్యూ గ్రిడ్’తో దక్షిణాది గ్రిడ్ అనుసంధానం

 సాక్షి, హైదరాబాద్:
 కొత్త ఏడాదిలో ‘ఒక దేశం - ఒక గ్రిడ్’ కల సాకారమైంది. ఇంతకాలం ఉత్తరాది గ్రిడ్ నుంచి దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం లేకపోవడంతో.. దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్ మిగులు ఉన్నా.. ఆ విద్యుత్ పొందడానికి అవసరమైన ట్రాన్స్‌మిషన్ లైన్లు లేకపోవడంతో ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. షోలాపూర్-రాయచూర్ మధ్య 765 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ సరఫరా లైను ఏర్పాటైంది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు షోలాపూర్-రాయచూర్ లైనును జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం చేయడంతో ఇకపై దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ విద్యుత్ సరఫరా లైను ఏర్పాటు ప్రక్రియ జనవరి మూడో వారం నాటికి సిద్ధమవుతుందని మొదట్లో భావించినా.. కొత్త సంవత్సర కానుకగా దీనిని అనుసంధానించారు. ఫలితంగా ఇన్నాళ్లుగా ఇతర గ్రిడ్‌లతో పూర్తిస్థాయిలో అనుసంధానం లేక ఒంటరిగా ఉన్న దక్షిణాది గ్రిడ్... ఇతర గ్రిడ్‌లతో అనుసంధానం కానుంది. ఫలితంగా జాతీయ గ్రిడ్ ఏర్పాటుకానుంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు కలగనుంది. ఈ లైను ఏర్పాటుతో ఏకంగా 2,100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఏర్పడనుంది. అదీ తక్కువ ధరకే.

 తెరపైకి జాతీయ గ్రిడ్...!

 విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌ల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు ప్రతీ రాష్ట్రానికి ఒక స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) ఉంటుంది. ఈ ఎస్‌ఎల్‌డీసీ ద్వారానే విద్యుత్ సరఫరా వ్యవస్థ నియంత్రిస్తారు. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, సబ్‌స్టేషన్లు, సరఫరా లైన్లు అన్నింటినీ కలిపి గ్రిడ్‌గా పేర్కొంటారు. ఇటువంటి గ్రిడ్లు.. రీజియన్ల వారీగా  దేశంలో ఐదుగా విభజించారు. అవి ఉత్తరాది గ్రిడ్, దక్షిణాది గ్రిడ్, తూర్పు గ్రిడ్, పశ్చివు గ్రిడ్, ఈశాన్య గ్రిడ్‌లు. ఇప్పటికేఉత్తరాది, తూర్పు, పశ్చిమ, ఈశాన్య గ్రిడ్‌లను అనుసంధానించారు. ఈ గ్రిడ్‌ను ‘న్యూ గ్రిడ్’(ఎన్‌ఈడబ్ల్యూ)గా పేర్కొంటారు. వాస్తవానికి దక్షిణాది గ్రిడ్‌ను న్యూ గ్రిడ్‌తో అనుసంధానించే పనులు ఇప్పటివరకు పూర్తికాలేదు. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మిగులు విద్యుత్‌ను తీసుకునే అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లేదు. న్యూ గ్రిడ్‌లో దక్షిణాది గ్రిడ్‌తో అనుసంధానించే ప్రక్రియు 2012 నాటికి పూర్తి కావాలి. అరుుతే, విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటులో ఆలస్యం వల్ల ఈ ప్రక్రియు కాస్తా ఆలస్యమైంది. తాజాగా షోలాపూర్-రాయచూర్ లైను ఏర్పాటుతో నేడు జాతీయ గ్రిడ్ ఆవిష్కృతమైంది. రాయచూర్ నుంచి రాష్ట్రంలోని కర్నూలుతో పాటు హైదరాబాద్‌కు లైన్లు ఉండటంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా సులభతరం కానుంది.

 తక్కువ ధరకే విద్యుత్...!

 ఉత్తరాది రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంది. అక్కడ తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉంది. అయితే, ఆ విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు లేదు. దీంతో ఇక్కడ విద్యుత్ ధర అధికంగా ఉండటంతో పాటు కోతలు కూడా అధికమే. ఈ నేపథ్యంలో జాతీయ గ్రిడ్ ఏర్పాటుతో ఈ రెండు సమస్యలు తీరనున్నాయని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘సాధారణ సమయంలో దక్షిణాది రాష్ట్రాలో యూనిట్ విద్యుత్ ధర 4-6 రూపాయలు పలికితే... ఉత్తరాదిలో కేవలం 2 రూపాయలకే లభ్యమవుతుంది. వేసవి కాలంలో దక్షిణాదిలో ఏకంగా 16-20 రూపాయల వరకూ యూనిట్ ధర ఎగబాకుతోంది. ఉత్తరాదిలో 4-6 రూపాయలకే విద్యుత్ లభ్యమవుతుంది. అయితే, అక్కడి నుంచి విద్యుత్‌ను సరఫరా చేసుకునేందుకు అవసరమయ్యే విద్యుత్ లైన్లు లేవు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు అధిక ధరను చెల్లించాల్సి వస్తోంది. తాజా షోలాపూర్- రాయచూర్ లైనుతో ఉత్తరాది నుంచి అదనపు విద్యుత్‌ను తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా విద్యుత్ ధరలు తగ్గుతాయి’ అని ఇంధనశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement