సాధారణంగా ఏదైనా సంక్షేమ పథకానికి ప్రభుత్వం నిధులు విదల్చకపోతే ఎవరైనా ఏమంటారు.పైసా కూడా విదల్చలేదు.ఇదేమి ప్రభుత్వమంటారు. కానీ చంద్రన్న పెళ్లి కానుక విషయంలో మాత్రం ఆ విమర్శ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి జంట ఖాతాలో సొమ్ములు జమ చేశారు. కానీ చెప్పినట్టుగా అర్హతను బట్టి కాదు.. అందరికి ఒకేలా..
అదీ ఎంతో తెలుసా..అక్షరాల ఒక్క రూపాయి. నిజంగా నిజం.ఇదేమిటి ఒక్క రూపాయి జమ చేయడం ఏమిటని ప్రశ్నిస్తే అబ్బే అదేం లేదు అకౌంట్ సరిగా ఉందో లేదో చెక్ చేయడానికే వేశాం.. త్వరలోనే మొత్తం ఒకేసారి జమ చేసేస్తాం అంటూ నమ్మబలుకుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక ఆదిలోనే అబాసు పాలవుతోంది. పథకం ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లి కానుక జమ చేయని పరిస్థితి నెలకొంది. విచిత్రమేమిటంటే విమర్శించడానికి వీల్లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో రూపాయి చొప్పున జమ చేశారు. మిగిలిన సొమ్ముల కోసం ఎప్పుడుపడతాయో తెరపై వేచి చూడండి అని ఊరిస్తున్నారు.
దరఖాస్తుల పరిశీలన పూర్తయినా..
చంద్రన్న పెళ్లి కానుక...రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న అమలులోకి తీసుకొచ్చిన పథకం. ఇందుకోసం ప్రతి మండలానికి డ్వాక్రా సంఘాల నుంచి ముగ్గురు వివాహమిత్రలను నియమించారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తో పాటు 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేసిన జంటల వివరాలను అప్‌లోడ్ చేశారు. వారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. వాటిని ప్రజాసాధికారిత సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చారు. గడిచిన మూడు నెలల్లో పెళ్లి కానుక కోసం 1323 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి.
బీసీ సామాజిక చెందానికి చెందిన 910, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 159, ఎస్టీలు 58, ముస్లీంలు ఏడుగురు, వికలాంగులు 29, ఇతరులు 12 మంది దరఖాస్తు చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న 29 మంది ఎస్సీ, 13 ఎస్టీ, 106 బీసీ జంటల నుంచి దరఖాస్తులు అందాయి. వీరిలో 1096 మందికి సంబంధించి పరిశీలన పూర్తి చేశారు. వీరిని అర్హులుగా గుర్తించి మంజూరుకు అప్‌లోడ్ చేశారు.
కేటగిరీల వారీగా..
ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతే రూ.50వేలు, బీసీలైతే రూ. 35వేలు, ముస్లింలకు రూ.50 వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏకులానికి చెందిన వారికైనా రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. 20 శాతం పెళ్లి నిశ్చయమైన రోజున..మిగిలిన 80శాతం పెళ్లిరోజున పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ముస్లిం జంటలకు రూ.3.50లక్షలు, ఎస్టీ జంటలకు రూ.29లక్షలు బీసీ జంటలకు 3.19 కోట్లు,ఎస్సీ జంటలకు రూ.63.60లక్షలు, వికలాంగ జంటలకు రూ.29లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.21.75లక్షలు, ఎస్టీలకు రూ.9.75లక్షలు, బీసీలకు రూ.79.50 లక్షలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన జంటలకు రూ.2.40లక్షలు జమ కావాల్సి ఉంది.
ఇలా మొత్తమ్మీద జిల్లాలో గడిచిన మూడు నెలల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు రూ.5.57 కోట్లు జమ చేయాలి. అప్‌లోడ్ చేసి దాదాపు మూడునెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లికానుక జమకాలేదు. దరఖాస్తు చేసుకున్న కొత్తజంటలు, వారి కుటుంబ సభ్యులు కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. మీ అకౌంట్‌లోకే నేరుగా సొమ్ములు జమవుతాయని చెబుతున్నారు. అర్హుల ఎంపిక విషయంలో వివాహ మిత్రలతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక్క రూపాయే జమ నిజమే
ఒక్క మన జిల్లాకే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెళ్లికానుకకు తొలి విడత సొమ్ములు విడుదల చేయలేదు. టెస్టింగ్ కోసం అందరి ఖాతాలకు ఒక్క రూపాయి చొప్పున జమ చేశారు. త్వరలోనే డబ్బులు రిలీజ్ కాగానే అందరి అకౌంట్‌కు పూర్తి స్థాయిలో కానుక జమ అవుతుంది. కానుక విషయంలో ఎవరికి ఎలాంటి మామూళ్లు ఇవ్వనసరం లేదు. ఎవరైనా డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకొస్తే యాక్షన్ తీసుకుంటాం.
–సత్యసాయి శ్రీనివాస్,పీడీ, డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment