ఒంగోలు నగరం వ్యూ
సాక్షి, ఒంగోలు: ‘కోట్లు కుమ్మరించాం. కొత్తగా తీర్చిదిద్దాం. ఐదేళ్లలో ఎంతో చేశాం. ఒంగోలు నగరానికి నయా అందాలు అద్దాం’... ఇదీ, స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేతలు జిల్లా కేంద్రం అభివృద్ధిపై పలుకుతున్న బీరాలు. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో ఏ విధంగా చూపించారో.. ఇక్కడ కూడా అదే విధంగా ఊహల్లోనే ఒంగోలు నగర అభివృద్ధిని చూపిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారనే దానిపై ప్రజలు చర్చించుకుంటుంటే అసలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. అభివృద్ధి అంతా భూ ఆక్రమణలు, అవినీతి, అక్రమాలలో మినహా నగరంలో ఎక్కాడా కనిపించడం లేదని జనం చర్చించుకుంటున్నారు. నిర్లక్ష్యం, అలసత్వంతో మౌలిక వసతులను కూడా నగరానికి దూరం చేశారని విమర్శిస్తున్నారు. ఆ అంశాలేంటో ఓసారి పరిశీలిద్దాం...
⇒ ఒంగోలుకు రెండో కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. కానీ, దాని నిర్మాణానికి స్థలం చూపించడంలో స్థానిక పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా అది నేటికీ కలగానే మిగిలిపోయింది. దీనికి ఎవరు అడ్డుపడ్డారో ఆ మాత్రం తెలియదా అంటూ జనం మధ్య చర్చ జరుగుతోంది.
⇒ ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో మిర్చి యార్డుకు అనుమతి వచ్చింది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జీవో జారీ అయంది. ఆ తర్వాత సమైక్యాంధ్రా ఉద్యమంతో అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన నాయకులకు ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదో మరి.
⇒ సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు కట్టామని చెప్పుకుంటే సరికాదు. సంతనూతలపాడు చెరువు, కొప్పోలు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా మారుస్తామన్నారు. ఎన్నింటిని మార్చారు. చివరకు గుండ్లకమ్మ నుంచి పైపులైను పనులు సైతం పూర్తిచేయలేక చేతులెత్తేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముందుచూపుతో రామతీర్థం నుంచి ఒంగోలుకు పైపులైను వేయడంతో నగరానికి ఈమాత్రమైనా నీళ్లొస్తున్నాయి. ఉలిచి చెక్‌డ్యాం ద్వారా అనేకమందికి మంచినీటి సౌకర్యం కలిగింది. లేకుంటే పెరిగిన జనాభాకు తగ్గట్లుగా తాగునీటికి సైతం కటకటలాడేది.
⇒ ఒంగోలులో క్రికెట్ స్టేడియం, జవహర్ నవోదయను సైతం మరో ప్రాంతానికి పంపి మరీ నిర్మిస్తామంటూ ప్రచారం చేశారు. మరి ఇప్పటివరకు ఎన్ని స్టేడియాలు నిర్మించారు. ఎంత అభివృద్ధి చేశారనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. కనీసం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియంకు సైతం మిక్కిలిగా నిధులున్నా చివరకు అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయడం తప్ప ఆ గ్రౌండు కనీసం ఒక్క క్రీడా పోటీ అయినా నిర్వహించేందుకు అనువు లేదంటూ క్రీడాకారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి
⇒ శివారు కాలనీల్లో, కొన్నిచోట్ల ప్రధాన కూడళ్లలో కనీసం మురుగునీటి పారుదల కూడా లేక ఇబ్బందులు పడుతుంటే దోమలపై దండయాత్ర కార్యక్రమాలు ఎలా విజయవంతమవుతాయని జనం భగ్గుమంటున్నారు. సిమెంటు రోడ్లకన్నా కాలువలపై దృష్టి పెడితే తమ ఆరోగ్యాలు బాగుండేయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
⇒ జిల్లా పరిషత్ భవనం నిర్మాణానికి ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక ప్లాన్, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరో ప్లాన్ నిర్మించి పంపించారు. ప్లాన్‌ల కోసమే నిధులు వెచ్చించారు. ఇదే విధంగా నగరపాలక సంస్థ కోసం ఒక ప్లాన్, ప్రకాశం భవనం, ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌లను అప్పటి కలెక్టర్లు విడుదల చేశారు. కానీ, పాత భవనాలకు నేడు రంగులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి
⇒ ప్లాస్టిక్ రహిత నగరం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేయడం. ప్లాస్టిక్ కవర్లలో వస్తువులను కలిగి ఉన్న ప్రజలకు, అమ్ముతున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు. కానీ, నేడు ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు మొత్తం ప్లాస్టిక్‌మయమే.
⇒ తాము అధికారంలోకి రాగానే ఒంగోలులో రెండో ఆర్టీసీ డిపో అన్నారు. కానీ, ఉన్న బస్సులను సైతం ప్రైవేటు పరం చేసి చివరకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లను మిగులు పేరుతో ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. బహుశా దీన్నే అభివృద్ధి అంటారేమో.
⇒ మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యాలయానికి కాసింత నిధులు కేటాయిస్తే అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కానీ, ఇంతవరకు అది కలగానే ఉండగా, కొత్తగా అమరవీరుల స్థూపం కోసం స్థలం కేటాయిస్తామని అంటున్నారు. ఆ స్థలం ఎక్కడో నేటికీ అతీగతీలేదు
⇒ సహకార వ్యవస్థను పరిశీలిస్తే.. కరువు ప్రకాశంలో పాడిపరిశ్రమ కాస్త ప్రజానీకాన్ని ఆదుకునేది. కానీ, డెయిరీలో పచ్చరాజకీయాలు చివరకు దాన్ని నిర్వీర్యం చేశాయి. ఇక ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధికి గండికొట్టడం, జిల్లా సహకార మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వెనుక ఎవరి స్వార్థ రాజకీయాలు ఉన్నాయనేది ఆపైనున్న జనార్దనునికే ఎరుక. పాలకవర్గ సభ్యులుగా ఎంపికైనా కనీసం తమ ప్రతిపాదన ఏదీ కార్యరూపం దాల్చకుండా అడుగడుగునా అడ్డుపడ్డ రాజకీయంపై నేటికీ పాలకవర్గ సభ్యులను కదిలిస్తే చాలు.. భగ్గుమంటున్న పరిస్థితి అందరికీ విధితమే
⇒ ఊహకు కూడా అందని రిమ్స్‌ను వైఎస్సార్ హయాంలో నిర్మిస్తే.. అందులోకి ప్లేట్‌లెట్ మిషన్ తెప్పించడానికి టీడీపీకి ఎన్నేళ్లు పట్టిందో అందరికీ అవగతమే. నేటికీ ఎమర్జన్సీ అయితే చాలు.. ప్రైవేటు ఆస్పత్రికో.. గుంటూరుకో వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో అభివృద్ధి అంటే కాలువల నిర్మాణం, టెండర్లు లేకుండా అయిన వారికే నామినేషన్ పద్ధతిన అధిక శాతానికి వర్కులు కట్టబెట్టడమేనా అంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
⇒ స్థానిక అద్దంకి బస్టాండు సెంటరులో ఊరచెరువు పక్కన పేద ముస్లింలు దశాబ్దాల తరబడి జీవనోపాధి పొందుతూ నిర్మించుకున్న గుడిసెలను ఒక్కవేటుకు ఎవరి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కూల్చివేశారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
⇒ ఒంగోలుకు కేంద్రం ట్రిపుల్ ఐటీని కేటాయించినా చివరకు నేటికీ తరగతులు ప్రారంభం కాకపోవడం ఆవేదన కలిగిస్తుంటే.. మరోవైపు ఎన్‌ఎస్‌పీ స్థలం కన్వర్షన్ కాకముందే అధికార పార్టీ నేతలకు పట్టాలు పంపిణీ చేయడంపై జరిగిన రాద్దాంతం నేటికీ చర్చనీయాంశమే.
⇒ తూర్పు సుజాతనగర్ కావొచ్చు, చెరువుకొమ్ముపాలెం దేవదాయశాఖ భూములు కావొచ్చు.. అధికార పార్టీ ఆక్రమణల గురించి నగరమంతా ధ్వనిస్తోంది.
⇒ ఒంగోలుకు ఎయిర్‌పోర్టు అన్నారు.. వ్యాపారం వృద్ధి చెందుతుందని, విదేశాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. కానీ, ఎయిర్‌పోర్టు ఊసు కాస్తా ఉసూరుమనిపించింది.
⇒ అధికార పార్టీ ఆగడాలకు ఎవరైనా అడ్డుచెబితే వారిపై నమోదయ్యే కేసులు ఎలాంటివో జిల్లా కేంద్రంలో నమోదైన అనేక కేసులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
⇒ హైదరాబాద్‌లో శిల్పారామాన్ని మాదిరిగా ఒంగోలులో కూడా నిర్మిస్తామన్నారు. ఆ ప్రక్రియ ఎందుకు నిలిచిపోయిందో ఎవరికీ తెలియదు. కనీసం చారిత్రక సంపదను కాపాడేందుకు అవసరమైన పురావస్తు మ్యూజియం నిర్మాణం కూడా మరుగునపడింది.
Comments
Please login to add a commentAdd a comment