=తెరుచుకోనున్న కార్యాలయాలు
=రూ.400 కోట్ల లావాదేవీల స్తంభన
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా గత 66 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను ఉద్యోగులు తాత్కాలికంగా విరమించారు. పూర్తిస్థాయి హామీ రాకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో విరమణ నిర్ణయం ప్రకటించారు. దీంతో జిల్లాలో గత రెండు నెలలుగా మూతపడ్డ ప్రభుత్వ, మున్సిపల్ కార్యాలయాలు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయి.
ఇప్పటివరకు జిల్లాలోనే వివిధ విభాగాలకు సంబంధించి రూ.400 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయినట్లు సమాచారం. సమ్మె ప్రభావంతో దుర్గగుడి దసరా ఉత్సవాలకు కూడా భక్తుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. సమైక్యంపై స్పష్టమైన హామీ లేకపోయినా సమ్మె విరమించాల్సి రావడంపై ఎన్జీవో సంఘాల నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమ్మె ఎంతకాలం కొనసాగించాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడటం, ఉపాధ్యాయులు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నుంచి వెనక్కి తగ్గడంతో ఎన్జీవోలు కూడా 2014 వరకు రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె నుంచి వైదొలుగుతున్నట్లు, పార్లమెంట్‌లో బిల్లు వస్తే మళ్లీ మెరుపు సమ్మెకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
సమ్మెలోకి వెళ్లిన తర్వాత ఎన్జీవోలు జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కూడా విజయవంతమైంది. జోరువానలోనూ ఒక్కరు కూడా వెళ్లకుండా మీటింగ్ అయ్యేవరకు సమైక్యస్ఫూర్తి చాటారు. రాజకీయ పార్టీలను కలుపుకోకుండా చేసిన ఒంటరి పోరాటం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని ఎన్జీవో నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ పోరాటం వల్ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లగలిగామన్న సంతృప్తి వారిలో వ్యక్తమవుతోంది.
విరమణ తాత్కాలికమే
ఎంతో కీలకమైన విభాగమైన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రజలు సర్టిఫికెట్లు, నిత్యావసరాల కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాతికంగా సమ్మె విరమించటం జరిగింది.
- సీహెచ్ అప్పారావు, రెవెన్యూ విభాగం
ముందుకెళితే మళ్లీ ఉద్యమం
అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించటం జరిగింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం ముందుకు వెళితే రాష్ట్ర కమిటీ సూచనతో మళ్లీ ఉద్యమబాట పడతాం.
- ఎ.రామకోటయ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ
ఎప్పుడైనా మెరుపుసమ్మె
విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నాం. సీఎంతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రస్తుతం సమ్మెను ఆపాం. కేంద్రం పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లును పాస్‌చేసే అవకాశాలు ఉంటే ఎప్పుడైనా మెరుపు సమ్మెకు దిగుతాం.
- సీహెచ్ మధుసూదనరావు, పాలిటెక్నిక్ కాలేజీ (ఏపీ ఎన్జీఓ విజయవాడ సంయుక్త కార్యదర్శి)
ప్రజలకు కృతజ్ఞతలు
ప్రస్తుత సమ్మె విరమణ తాత్కాలికమే. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు మళ్లీ సమ్మె చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు చెబుతున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టే పరిస్థితి ఉంటే మెరుపు సమ్మెకు దిగుతాం.
- కర్రి నరసింహారావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
ఉద్యోగ సంఘ జేఏసీ నేత
ప్రజాప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని
ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సమ్మె వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఏపీఎన్జీవోలు విరమణకు దిగారు. ఈ ఉద్యమంలో వారు కుటుంబంలోని పెద్దన్న పాత్ర పోషించారు. సీమాంధ్రుల మనోభావాలకు అనుగుణంగా పోరాడారు. వారి పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఎప్పుడైనా సిద్ధం.
- ఎండీ ప్రసాద్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి
ఆలోచన రేకెత్తించగలిగాం..
ఏపీ ఎన్జీవోల సమ్మెతో సీమాంధ్రుల, తెలంగాణ సమస్య బయటపడింది. రాష్ట్ర విభజన అంశంపై ఆలోచన రేకెత్తించగలిగాం. చిత్తశుద్ధిలేని రాజకీయ నాయకులతో కాకుండా ఉద్యోగులతో ఇంతవరకు ఉద్యమం కొనసాగించగలిగాం. ఎంపీలు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే ఉద్యమాన్ని విజయవంతం చేయగలం.
- రావి సుబ్బారావు, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి