రెవెన్యూలో పారదర్శకతకు కార్యాచరణ
పాలకొండ: జిల్లా రెవెన్యూ శాఖలో మార్పులకు కార్యాచరణ రూపొందుతోంది. కీలకమైన ఈ శాఖలో పారదర్శకత, సమగ్రత కోసం మరింత క్రియాశీలకంగా పని చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ క్రమంలోనే తహశీల్దార్ల పనితీరును అంచనా వేయడంతో పాటు మండలాలకు సంబంధించిన సమగ్ర వివరాలతో నివేదికలు రూపొందించేందుకు సమాయత్తమవుతోంది. సెప్టెంబరు 1 నుంచి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మొదట రాజాం మండలాన్ని పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలానికి సం బంధించి పూర్తి నివేదిక రూపొందించడం, అం దులో రెవెన్యూపరమైన అన్ని అంశాలు క్రోడీకరించడం, ప్రజలకు పారదర్శక సేవలందించడం దీని లక్ష్యం.
ఈ కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్ పాలకొండ డివిజన్ కేంద్రంలో మంగళవారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని మూడు డివిజన్లకు చెందిన పలువురు తహశీల్దార్లను ఈ సమావేశంలో సమన్వయపరిచి ప్రజాపంపిణీ వ్యవస్థ, పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు, రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, ప్రభుత్వ భూముల గుర్తింపు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రాజాం మండలానికి సంబంధించి పూర్తి స్థాయి లో అధ్యయనం చేశారు. పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్ డివిజన్‌లోని మండలాల స్థితిగతులు, ప్రజల జీవన విధానంపై గణాంకాలతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా రు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, జి.సిగడాం, నరసన్నపేట, రాజాం మండలాల తహశీల్దార్లతో పాటు కలెక్టరేట్ పరిపాలనాధికారి కాళీప్రసాద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
పాలన సరళతరం చేసేందుకే...
ఈ సందర్భంగా జేసీ వీరపాండ్యన్ మాట్లాడుతూ రెవెన్యూ పాలన సరళతరం చేసేందుకే మండలాల వారీగా తహశీల్దార్ల పనితీరు, మం డలాల సమగ్ర నివేదిక రూపకల్పన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో రెవెన్యూ సిబ్బందికి ఇదొక కీలకమైన ప్రక్రియగా అభివర్ణించారు. రెవెన్యూ అధికారులంతా ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో నిమగ్నమై పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు.