శేషాచలంలో మళ్లీ దావానలం.. | operation Sheshachalam continuous Second Day | Sakshi
Sakshi News home page

శేషాచలంలో మళ్లీ దావానలం..

Published Sat, Mar 22 2014 2:36 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

శేషాచలంలో మళ్లీ దావానలం.. - Sakshi

శేషాచలంలో మళ్లీ దావానలం..

సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో ఆరు రోజులుగా రగిలిన కార్చిచ్చును ఆర్పివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ కార్చిచ్చు రాజుకుంది. శ్రీవారిమెట్టు కాలిబాట ఆరంభంలో రోడ్డు పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పుపెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కంగుతిన్న టీటీడీ, కేంద్ర, రాష్ట్ర  ఉన్నతాధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడే అందుబాటులో ఉన్న మూడు ఫైరింజన్లను రంగంలోకి దించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. తిరుమల, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా మరికొన్ని ఫైరింజన్లు తెప్పించారు. ఇరుకైన అటవీమార్గంలో ఫైరింజన్ల పైపులు వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడినా ఎట్టకేలకు మంటలను అదుపు చేశాయి. సాయంత్రం వెలుతురు సరిగా లేని కారణంగా ఓ హెలికాప్టర్ అగ్నిప్రమాద ఘటన స్థలంపై ఏరియల్ సర్వే నిర్వహించినా.. సహాయక చర్యల్లో మాత్రం పాల్గొనలేకపోయింది. ఇదిలావుంటే.. శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగే అవకాశాలను గుర్తించి, నివారించేందుకు ప్రతి సంవత్సరం చేపట్టే ‘ఫైర్ ట్రేసింగ్ ఆపరేషన్స్’ టీటీడీ వారు ఈ ఏడాది చేపట్టకపోవటం వల్లే దావానలాలు వ్యాపిస్తున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు రోజులుగా కార్చిచ్చులో బుగ్గయిన శేషాచలం శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిగా చల్లబడింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ17సీ-130 హెలికాప్టర్లు మంటలు చెలరేగిన కాకులకొండ, తుంబరు కోనల్లో  మంటలు వచ్చిన ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మొత్తం 2.5 లక్షల లీటర్ల నీటిని వెదజల్లాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చివరిసారిగా హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. తిరుమల అడవులను ఆవరించిన దావానలాన్ని భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) విజయవంతంగా ఆర్పివేసిందని రక్షణ శాఖ కూడా బెంగళూరులో ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో.. రెండు రోజులుగా కాకులకొండ, తుంబురుకోనలో మంటలు ఆర్పే చర్యల్లో పాల్గొన్న 150 మంది సైనిక సిబ్బంది, అరక్కోణం, విశాఖపట్నంకు చెందిన 40 మంది నావికాదళం, చెన్నైలోని రాజస్థాన్ 25వ బెటాలియన్‌కు చెందిన 100 మంది అగ్నిమాపక సిబ్బంది వెనుతిరిగేందుకు సిద్ధమయ్యారు. కానీ.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు నడిచివచ్చే కాలిబాట మార్గమైన శ్రీవారిమెట్టు వద్ద అడవికి నిప్పు అంటుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే సైనిక, నౌకాదళం, అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి పంపించారు.. వారు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో మంటలను ఆర్పివేశారు. ఈ సిబ్బంది మొత్తాన్నీ, ఆపరేషన్ శేషాచలాన్నీ మరో రోజు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement