వందలాది ఎకరాల్లో అడవి బుగ్గిపాలు
సాక్షి, తిరుమల: తిరుపతి శేషాచల అడవుల్లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. ఆదివారం శ్రీవారి మెట్టుకు సమీపంలోని నారాయణగిరి పర్వత శ్రేణుల్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్నికి వందలాది ఎకరాల అడవి బుగ్గిపాలైంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఎగువ ప్రాంతంలోని జేఈవో క్యాంపు కార్యాలయం, ఇతర కాటేజీల వరకు మంటలు విస్తరించకుండా నిరోధించారు. ముందు జాగ్రత్తగా శ్రీవారిమెట్టు కాలిబాటలో వచ్చే భక్తులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేశారు. ఆ మార్గంలో ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాకే భక్తులను అనుమతించారు. అయితే గాలి వాలుతో మంటలు కింది భాగంలోని లోయ నుంచి కల్యాణి డ్యాం ఉండే అటవీ ప్రాంతంలోకి విస్తరించాయి. ఆ ప్రాంతంలో సాయంత్రం వరకు మంటలు రేగుతూనే ఉన్నాయి. దట్టమైన పొగ కూడా అలముకుంది. మంటలు అదుపుచేసే పనులను టీటీడీ సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షించారు.