అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని, రాజ్యాంగంలోని మూడో అధికరణ దుర్వినియోగాన్ని నిరోధించాలని, ఏ రాష్ట్రాన్నయినా ఏకపక్షంగా విభజించేందుకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3 సవరణ కోసం మద్దతివ్వాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు నవంబర్ 16వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా పర్యటించారు. పార్టీ ప్రతినిధుల బృందంతో న్యూఢిల్లీ నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి.. ఆయా పార్టీల అధ్యక్షులు, అగ్రనాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయా నాయకుల స్పందనలు ఇవీ...
ఏ రాష్ట్ర విభజనకైనా మేం వ్యతిరేకం
‘‘భాషాప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన ఏ రాష్ట్రం విభజననైనా సరే సీపీఎం గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకసారి విభజన ప్రక్రియను ఆరంభించినట్టయితే, తేనెతుట్టెను కదిలించినట్టవుతుందని మేం మొదట్నుంచీ చెప్తున్నాం. అది మున్ముందు కూడా కొనసాగుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు, ఇంకా ఈ అంశం చర్చకొచ్చే ఇతరత్రా వేదికలన్నింటిపైనా వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని మేం గట్టిగా కోరతాం.’’ - సీతారాం ఏచూరి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు (న్యూఢిల్లీ, 16 నవంబర్ 2013)
ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్టీలో చర్చిస్తాం
‘‘రాష్ట్రాలను ఏకపక్షంగా విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారమిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్-3 దుర్వినియోగం కాకుండా చూసే అంశంపై తప్పనిసరిగా పార్టీలో చర్చిస్తాం. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటుపై మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. పునరాలోచన ప్రసక్తే లేదు.’’
- సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి (న్యూఢిల్లీ, 16 నవంబర్)
సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తా
‘‘ఆర్టికల్ 3 సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తా. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలు చేయాలంటూ ఫజల్ అలీ కమిషన్ సూచించిన అంశం కొత్త విషయం. దీన్ని సైతం పార్టీ దృష్టికి తీసుకెళ్తా. మాది చిన్న రాష్ట్రాల విధానం. అయినా ఈ అంశాలను తప్పక పార్టీ దృష్టికి తీసుకెళ్తా.’’
- రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు (17 నవంబర్ 2013)
పార్లమెంటులో అడ్డుకుంటాం...
‘‘ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలని చూస్తే ఇటు లోక్‌సభలోనూ అటు రాజ్యసభలోను అడ్డుకుంటాం.’’ - మమతాబెనర్జీ, బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత(కోల్‌కతా, 20 నవంబర్)
విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం
‘‘ఏపీ విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం. ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకుండా సవరించాలి. - ఉద్ధవ్‌ఠాక్రే, శివసేన అధ్యక్షుడు (ముంబై, 25 నవంబర్, )
జగన్ లేవనెత్తిన అంశాలు కీలకమైనవి
‘‘ఎన్‌సీపీ 9 నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి జగన్ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకు వెళ్లరాదని, మూడో అధికరణ సవరణ విషయాన్ని ప్రస్తావించారు. మా వర్కింగ్ కమిటీలో వీటిపై సీరియస్‌గా చర్చిస్తాం.’’ - శరద్‌పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, (ముంబై, 25 నవంబర్)
ప్రజలను సంప్రదించాల్సింది..
‘‘ఆంధ్రప్రదేశ్ విషయంలో.. విభజన నిర్ణయం తీసుకోవటానికి ముందు రాష్ట్ర ప్రజలను సంప్రదించి ఉండాల్సింది. సంకుచిత రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించటం సరికాదు.’’ - నవీన్‌పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి, (భువనేశ్వర్, 24 నవంబర్)
తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం
‘‘చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. పైగా కొత్త సమస్యలు తలెత్తుతాయి. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. ఆర్టికల్-3 ప్రకారమే కాదు.. ఏవిధంగా విభజించినా సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకిస్తుంది.’’
- అఖిలేష్‌యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, (లక్నో, 06 డిసెంబర్)
బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటాం
‘‘ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును మా పార్టీ పార్లమెంట్‌లో అడ్డుకుంటుంది’’ - ములాయంసింగ్‌యాదవ్, సమాజ్‌వాది పార్టీ అధినేత (ఢిల్లీ, 9 డిసెంబర్)
సవరణకు మద్దతిస్తా
‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఈ తరహాలో విభజించడం తెలివైన నిర్ణయం కాదు. ఆర్టికల్ 3 సవరణ కోసం పెడుతున్న వాయిదా తీర్మానానికి మద్దతునిస్తాం. - దేవెగౌడ, మాజీ ప్రధాని, (ఢిల్లీ, 9 డిసెంబర్ )
అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం
‘‘రాష్ట్రాల అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం. రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరముంది.’’ - నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి (పాట్నా, 13 డిసెంబర్ )
తీర్మానం తీసుకోవాల్సిందే: బాదల్
‘‘ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి ఆ రాష్ట్రం నుంచి తీర్మానం తప్పకుండా తీసుకున్నపుడే విభజన అంశాన్ని పరిశీలించాలి.’’ - ప్రకాశ్‌సింగ్‌బాదల్, పంజాబ్ సీఎం, (ఢిల్లీ, 13 డిసెంబర్ )