వ్యతిరేక తీర్మానాలను ‘మినిట్స్’లో రాయొద్దు!
‘భూ సమీకరణ’ గ్రామ పంచాయతీలకు సర్కారు హుకుం
సాక్షి విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరపడానికి తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ఎంపిక చేసిన 17 గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. భూ సమీకరణకు వ్యతిరేకంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తీర్మానం చేసినా ఆ విషయాన్ని మినిట్స్ బుక్‌లో రాయొద్దని పంచాయతీ ఈఓలకు ఆదేశాలు జారీచేసింది. భూ సమీకరణకు ఎంపిక చేసిన అనేక గ్రామాల్లో రైతులు తాము భూములు ఇచ్చేది లేదని ముక్త కంఠంతో చెప్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులంతా ఒక్కటై తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. పంచాయతీ చట్ట ప్రకారం ఏర్పడిన గ్రామం చట్ట సభ కావడంతో ఇందులో కూడా తీర్మానం చేసి.. వాటిని సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధానమంత్రి, రాష్ట్రపతిలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా నిడమర్రు పంచాయతీ పాలకవర్గ సమావేశంలో భూ సమీకరణను తమ గ్రామంలోని రైతులు వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేశారు. దీన్ని మినిట్స్ బుక్‌లో రాశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి మీద ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
సమీకరణకు ఎంపిక చేసిన గ్రామాలతో పాటు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, అమరావతి, దుగ్గిరాల మండలాల్లోని అన్ని పంచాయతీల్లో ఇలాంటి తీర్మానాలను అధికారికంగా నమోదు చేయొద్దని మౌఖిక ఆదేశాలు జారీ ఆయ్యాయి. తుళ్లూరు మండలంలోని రాయపూడి పంచాయతీ సర్వసభ్య సమావేశం కూడా భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఆ పంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని మినిట్స్ లో రాయలేదు. పంచాయతీ సమావేశాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే ఎవరైనా న్యాయపోరాటానికి దిగితే చిక్కులు వస్తాయనే ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.